వందశాతం ఇంటి పన్నుల వసూలు
గీసుకొండ: మండలంలోని ఆరెపల్లి గ్రామ ప్రజలు వందశాతం ఇంటి పన్ను చెల్లించి ఆదర్శంగా నిలిచారు. 2025 – 26వ ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను రూ. 94,910, నల్లా పన్ను రూ. 18,240, ఇతర పన్నులు రూ.9 వేలు.. మొత్తం కలిపి రూ.1,22,150 వసూలైనట్లు సర్పంచ్ తుమ్మనపెల్లి స్వప్న, పంచాయతీ కార్యదర్శి నల్లెల్ల స్వప్న శనివారం వెల్లడించారు. సాధారణంగా మార్చి నెలాఖరులోపు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా, అంతకుముందే జనవరి మొదటి వారంలోనే వందశాతం చెల్లించడం విశేషం. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటు ఉప సర్పంచ్ తిప్పారం శ్రీనివాస్, వార్డు సభ్యులు కేపీ రాజు, లకిడె శంకర్‌రావు, హేమలత, మేకల రాము, మోటె లలిత, స్రవంతి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఆరెపల్లెతో పాటు చంద్రయ్యపల్లెలో సుమారు వంద శాతం వసూలు కాగా, మిగతా గ్రామాల్లోనూ ఇంటి పన్నుల వసూలు కార్యక్రమం కొనసాగుతోందని ఎంపీఓ శ్రీనివాస్ తెలిపారు.
● ఆదర్శంగా నిలిచిన ఆరెపల్లి వాసులు


