మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ
ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రతీసారి సంక్రాంతి తర్వాత ఆది, బుధవారాల్లో వారాంతపు జాతరలకు భక్తులు ఎక్కువగా వచ్చేవారు. ఈ నెల చివరలో మేడారం జాతర ఉండడంతో భక్తులు సంక్రాంతి కంటే ముందుగానే మల్లన్న దర్శనానికి బారులు దీరుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పట్నాలు, బోనాలు, ఒడిబియ్యం, సారె సమర్పించి, కోడెలు కట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, అధికారులు తెలిపారు.


