చకచకా ఏర్పాట్లు
‘పుర‘ పోరుకు అధికార యంత్రాంగం కసరత్తు
మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై రోజూ జిల్లా ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరా తీస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మున్సిపాలిటీ ముసాయిదాపై రాజకీయ పార్టీల నాయకులతో ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండటంతో వాటిని ఎన్నికల నుంచి మినహాయించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏప్రిల్ తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు.
నేడు రాజకీయ పార్టీలతో భేటీ... ‘గ్రేటర్’ ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే?
సాక్షి ప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఈనెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా సవరించిన ఓటర్ల జాబితాను వెల్లడించేందుకు అధికార యంత్రాంగం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ శనివారం నుంచి జోరందుకుంది. అందుకు తగినట్లుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓటర్ల లెక్కింపు.. కేంద్రాల గుర్తింపు
గత నెల 30న ముసాయిదా జాబితా ప్రకటించగా.. ఈ నెల 10న తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ నోటిఫికేషన్‌లో భాగంగా మున్సిపాలిటీల వారీగా 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలు కూడా ఇచ్చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనచేసి.. వీటి ఆధారంగానే రిజర్వేషన్లను నిర్ణయించే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, జనగామ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి మున్సిపాలిటీలతోపాటు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలకు కూడా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.
వసతులున్న చోటే పోలింగ్ కేంద్రాలు..
మౌలిక వసతులు ఉన్న వాటినే పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. గత ఆగస్టులో కేంద్రాలను గుర్తించగా, తిరిగి అవి ఆయా వార్డుల పరిధిలోకి వస్తాయా రావా అనేది అధికారులు మరోసారి పరిశీలించి ఎంపిక చేయనున్నారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు కేంద్రాల ఏర్పాటుపైనే అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 10న వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. కేంద్రాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు
11న లేదా 20న నోటిఫికేషన్..? అధికారులకు సంకేతాలు
పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు ముసాయిదా జాబితా
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అయా మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య, 2011 లెక్కల ప్రకారం జనాభా
మున్సిపాలిటీ వార్డుల మొత్తం ఎస్టీలు ఎస్సీలు
సంఖ్య జనాభా
పరకాల 22 34,318 472 8,262
నర్సంపేట 30 51,086 4,397 7,110
వర్ధన్నపేట 12 13,732 3,980 2,470
జనగామ 30 52,408 1,694 8,335
స్టేషన్‌ఘన్‌పూర్ 18 23,483 962 6,663
భూపాలపల్లి 30 57,138 4,464 11,966
మహబూబాబాద్ 36 68,889 14,220 9,709
డోర్నకల్ 15 14,425 3,536 2,866
కేసముద్రం 16 18,548 3,754 2,418
మరిపెడ 15 17,685 7,635 3,062
తొర్రూరు 16 19,100 2,093 3,985
ములుగు 20 16,533 1,844 2,470
మొత్తం 260 3,87,345 49,051 69,316


