పంట చేతికొస్తోంది
గీసుకొండ: జిల్లాలో మూడేళ్ల క్రితం సాగు చేసిన ఆయిల్‌పామ్ పంట రైతుల చేతికొస్తోంది. కొందరు రైతులు ఇప్పటికే గెలలను కోసి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. పత్తి, వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలు ఇటీవల మోంథా తుపానుతో దెబ్బతిని రైతులకు నష్టాన్ని మిగిలిల్చాయి. అయితే, ఆయిల్‌పామ్ తోటలు తుపానుకు తట్టుకుని నిలబడ్డాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం తోటల నుంచి గెలలు రావడంతో వారికి ఆదాయం వస్తోంది.
విదేశాల నుంచి నారు దిగుమతి..
మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీ వారు ఇండోనేషియా, థాయిలాండ్ నుంచి ఆయిల్‌పామ్ నారును ప్రత్యేక విమానంలో తీసుకుని వచ్చారు. సంగెం మండలం రాంచంద్రాపురం నర్సరీలో నారును పెంచారు. ఆ తర్వాత రైతులకు మొక్కలు అందించారు. ఈ నర్సరీలో పంపిణీకి ఇంకా 1.50 లక్షల మొక్కలు ఉన్నాయి. ఒక్కో మొక్క ధర రూ.193 ఉండగా 90 శాతం సబ్సిడీతో రైతులకు రూ.20కే అందిస్తున్నారు.
ఆశాజనకంగా ధరలు..
ఆయిల్‌పామ్ గెలలను కొనుగోలు (సేకరణ) చేయడానికి నర్సంపేట, వర్ధన్నపేట, పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు గెలలను కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వెళ్తే రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీవారు వాటిని సేకరించి ఖమ్మంలోని ఆయిల్ తయారు చేసే కంపెనీలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం టన్ను గెలకు రూ.19,681 కంపెనీ వారు చెల్లిస్తున్నారు. ప్రతి నెల టన్ను గెల ధర నిర్ణయిస్తారని, ప్రస్తుతం ధర ఆశాజనకంగానే ఉందని రైతులు చెబుతున్నారు. వరి, పత్తికి బదులుగా ఆయిల్‌పామ్ సాగు చేస్తే మేలని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.
ఎకరాకు 10 మెట్రిక్ టన్నుల గెలలు..
ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్ల వానతో ఈ పంటకు నష్టం ఉండదు. కోతులు, దొంగలు, చీడపీడల బెడద ఉండదు. ఎకరం చేనులో కోసిన గెలలకు 2 టన్నుల వరకు నూనె వస్తుంది. ఇతర నూనె పంటలతో పోలిస్తే 10 రెట్లు అధిక దిగుబడి వస్తుంది. ఎకరాకు సగటున 10 మెట్రిక్ టన్నుల వరకు గెలలు వస్తాయని అంటున్నారు. ఎకరంలో పంటను సాగుచేస్తే ఉద్యాన శాఖ ద్వారా రూ. 50 వేల వరకు పలు రకాల రాయితీలు లభిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 28 సహకార సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘంలో వంద ఎకరాల వరకు ఆయిల్‌పామ్ సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా సహకార అధికారి నీరజ తెలిపారు.
లాభదాయకమైన పంట
మూడేళ్ల క్రితం 9 ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటాను. అప్పుడు సాగు ఖర్చు రూ.1.50 లక్షలు వచ్చింది. గత సెప్టెంబర్ నుంచి గెలలు కోతకు రావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు కోయగా నాలుగు టన్నుల గెలలు వచ్చాయి. ప్రస్తుతం టన్ను గెల ధర రూ.19,681 గా ఉంది. నేను పత్తి, అరటి, వరి పంటలను కూడా సాగు చేస్తున్నాను. వాటితో పోలిస్తే ఆయిల్‌పామ్ సాగు ఎంతో లాభదాయకంగా ఉంది. ఆ పంటలు మోంథా తుపాన్‌కు దెబ్బతిన్నాయి. ఈ పంట తట్టుకుని నిలబడింది. ప్రతీ 20 రోజులకు గెలలు కోతకు వస్తున్నాయి.
– ఆర్.రాంరెడ్డి, నాచినపల్లి, దుగ్గొండి మండలం
30 సంవత్సరాల వరకు దిగుబడి
ఆయిల్‌పామ్ తోటల నుంచి 30 సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుంది. మూడేళ్ల తర్వాత ఎకరాకు ఏడాదికి రూ.1.50 లక్షల ఆదాయం సమకూరుతుంది. ప్రకృతి వైపరీత్యాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొదటి మూడేళ్లపాటు వరి తప్ప ఇతర పంటలను అంతర పంటగా సాగు చేసుకుని ఎకరాకు ఏడాదికి రూ.30 వేల వరకు ఆదాయం పొందవచ్చు.
– డాక్టర్ ఎం.తిరుపతి,
వరంగల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి
మూడేళ్ల క్రితం ఆయిల్‌పామ్
సాగుకు రైతుల శ్రీకారం
జిల్లాలో 5,929 ఎకరాల
విస్తీర్ణంలో క్రాప్
గెలల సేకరణకు
మూడు కేంద్రాల ఏర్పాటు
టన్ను ధర ప్రస్తుతం రూ.19,681
పంట చేతికొస్తోంది
పంట చేతికొస్తోంది
పంట చేతికొస్తోంది


