కమ్యూనిస్టులతోనే ప్రజలకు రక్షణ
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
నర్సంపేట: కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే సమాజంలో ప్రజలకు రక్షణ ఉంటుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీపీఐ ఆవిర్భావ దినోత్సవ బస్సు యాత్ర గురువారం నర్సంపేటకు చేరుకుంది. అంబేడ్కర్ సెంటర్‌లో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో రానున్న రోజుల్లో కమ్యూనిస్టులకే భవిష్యత్ ఉంటుందని, చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీపీఐ ఉద్యమిస్తోందని తెలిపారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎర్రజెండా పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన మణికంఠరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రహమాన్, సీపీఐ వరంగల్, హనుమకొండ జిల్లా కార్యదర్శులు ఎస్‌కే బాష్మియా, కర్రి భిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆధార శ్రీనివాస్, వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి దండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


