పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. దమ్మన్నపేట గ్రామానికి చెందిన మామిండ్ల కొమురయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రూ.2 లక్షల ఎల్‌ఓసీ కాపీని ఆయన కొమురయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
హెచ్‌ఎం, ఉపాధ్యాయుడి సస్పెన్షన్
రాయపర్తి: మండలంలోని మహబూబ్‌నగర్ ఎంపీపీఎస్‌లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు డి.జగన్మోహన్, ఉపాధ్యాయుడు జి.వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇన్‌చార్జ్ ఎంఈఓ వెన్నంపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విధి నిర్వహణలో అలసత్వంతోపాటు విద్యార్థులతో వారు దురుసుగా ప్రవర్తించడంతో పాఠశాలను పలుమార్లు సందర్శించినట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులను విచారించి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీచేసినట్లు ఎంఈఓ వివరించారు. మండలంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎంఈఓ శ్రీనివాస్ హెచ్చరించారు.
గ్రంథాలయాల్లో
పుస్తకాలు చదవాలి
వరంగల్ చౌరస్తా: గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా గ్రంథాలయసంస్థ పర్సన్ ఇన్‌చార్జ్ జి.సంధ్యారాణి సూచించారు. 58వ జాతీయ గ్రంథాలయ ముగింపు వారోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ ఎల్లంబజారులోని గ్రంథాలయంలో గురువారం బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథి గా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ తాను ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా గ్రంథాలయాల్లో చదివి పోటీ పరీక్షలో విజేతనయ్యానని గుర్తుచేశారు. కార్యదర్శి అలివేలు మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. అనంతరం లైబ్రేరియన్లు, సిబ్బందిని సన్మానించారు. చినబాబు, పద్మారావు, రామచందర్, రజిత, లలిత, లక్ష్మి, అశోక్, రాజమౌళి, ఠయ్యాల శ్రీధరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట సొసైటీ పాలకవర్గం కొనసాగింపు
నర్సంపేట రూరల్: చెన్నారావుపేట సొసైటీ పాలకవర్గాన్ని యథావిధిగా కొనసాగించాలని జిల్లా సహకార శాఖ అధికారి నీరజ గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేసి పర్సన్ ఇన్‌చార్జ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. అయితే, చెన్నారావుపేట సొసైటీ పర్సన్ ఇన్‌చార్జ్‌గా జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయభాస్కర్‌రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో సొసైటీ పాలకవర్గ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు హైకోర్టు యథావిధిగా సొసైటీ పాలకవర్గాలను కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. దీంతో మళ్లీ సొసైటీ చైర్మన్‌గా చింతకింది వంశీతోపాటు పాలకవర్గ సభ్యులు యథావిధిగా కొనసాగనున్నారు.
కొమ్మాలలో
గొర్రెల అపహరణ
గీసుకొండ: కొమ్మాల గ్రామ శివారులోని షెడ్డులో ఉన్న 8 గొర్రెలను దొంగలు అపహరించుకెళ్లారు. ఈ విషయమై బాధితుడు బట్టమేకల రాజయ్య గురువారం గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్మాల గ్రామ శివారు వరంగల్–నర్సంపేట రహదారి పక్కన గొర్రెల కోసం భూమి కౌలుకు తీసుకుని షెడ్డు నిర్మించాను. అందులో రాత్రి వేళ జీవాలను ఉంచుతున్నా. బుధవారం రాత్రి దొంగలు గొర్రెల షెడ్డు తడకలను తొలగించారు. మందలో 40 జీవాలు ఉండగా వాటిలో 3 గొర్రెపోతులు, 5 గొర్రెలను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.1.35 లక్షలు ఉంటుందని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజయ్య తెలిపాడు.
పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్


