ఎయిర్‌పోర్ట్‌తో పారిశ్రామికాభివృద్ధి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ఇందుకు ఇళ్లు కోల్పోయిన వారు, భూ నిర్వాసితులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. ఈమేరకు గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఇళ్లు కోల్పోయిన గాడిపల్లికి చెందిన 23 మంది, ఆర్‌అండ్‌ఆర్ కమిటీ సభ్యులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ రన్‌వే విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న 23 మంది పరిహారం తీసుకోవడానికి సమ్మతించడం అభినందనీయమని పేర్కొన్నారు.అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఆర్ అండ్ ఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బాలలు భయాన్ని వీడాలి
వరంగల్: బాలలు భయాన్ని వీడి ప్రశ్నించడం నేర్చుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా బాలల సంరక్షణ యూనిట్, డాన్‌బాస్కో ఎన్‌జీఓ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాకథాన్‌ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కాశిబుగ్గ జంక్షన్ నుంచి ఓసిటీ గ్రౌండ్స్ వరకు జరిగిన ర్యాలీలో పాఠశాలలు, బాలల సంరక్షణ సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఓసిటీ గ్రౌండ్స్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాలలు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి సాంబశివరావు, జిల్లా యువజన, క్రీడల అధికారి అనిల్, జిల్లా బాలల సంక్షేమ అధికారి ఉమ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వసుధ, సభ్యులు మధు, షాహెదా, సుజాత, ఎంఈఓ వెంకటేశ్వర్‌రావు, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ కల్పన, ఎన్జీఓల కోఆర్డినేటర్లు సంతోష్, శిరీష పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి..
న్యూశాయంపేట: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఇసుక లభ్యత, రవాణా తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షించాలన్నారు.
కలెక్టర్‌ను అభినందించిన పరకాల ఎమ్మెల్యే
దక్షిణ భారత దేశంలో జలసంరక్షణ కేటగిరీ–2లో జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో అవార్డు అందుకున్న కలెక్టర్‌ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అభినందించారు.
ఓటర్ల రివిజన్‌పై సమావేశం
ఓటర్ల రివిజన్‌పై కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, ఈఆర్వోలు, అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఎలక్షన్ డీటీ రంజిత్‌కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు (కాంగ్రెస్), కె.శ్యాం (టీడీపీ), బాకం హరిశంకర్(బీజేపీ), రజనీకాంత్ (వైఎస్సార్ సీపీ), అనిల్‌కుమార్(బీఎస్పీ) పాల్గొన్నారు.
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి సర్పంచ్ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి ఉన్నారు.


