
వ్యాధుల కాలం జాగ్రత్త..
గీసుకొండ: విస్తారంగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో పరిసర ప్రాంతాలు, రోడ్లు చిత్తడిగా మారాయి. డ్రెయినేజీలు లేని చోట మురుగునీరు రోడ్లుపైకి చేరుతోంది. పలు ప్రాంతాల్లోని గుంతలు, ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచి దోమలు, ఈగలకు నిలయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కీటకజనిత వ్యాధులతోపాటు డయేరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దోమల ద్వారా మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధులు, కలుషిత ఆహారం, తాగునీటితో డయేరియా సోకి వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, డయేరియా సోకితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, హెల్త్ సబ్‌సెంటర్లకు వెళ్లాలని సూచిస్తున్నారు.
వరంగల్ నగరంలో
సమస్యాత్మక ప్రాంతాలు..
వరంగల్ నగర పరిధిలో డెంగీ సోకే సమస్యాత్మక ప్రాంతాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. దేశాయిపేట అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ (యూపీహెచ్‌సీ) పరిధిలో సీకేఎం కళాశాల ప్రాంతం, ఎల్‌బీనగర్, ఎంహెచ్ నగర్, కాశిబుగ్గ యూపీహెచ్‌సీపరిధిలో సొసైటీ కాలనీ, పద్మనగర్, కీర్తినగర్ యూపీహెచ్‌సీ పరిధిలో ఎన్‌టీఆర్‌నగర్‌తోపాటు ఎంజీఎం ప్రాంతంలోని రామన్నపేట, కొత్తవాడ, మట్టెవాడ, ఖిలా వరంగల్, రంగశాయిపేట, శంభునిపేట, గణేశ్‌నగర్ తదితర ప్రాంతాల్లో డెంగీ సోకే అవకాశాలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో..
పర్వతగిరి, నెక్కొండ, అప్పల్‌రావుపేట, గీసుకొండ గ్రామం, వర్ధన్నపేట, చెన్నారావుపేట, జల్లి, నందిగామ, నర్సంపేట ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
పెరుగుతున్న కేసులు..
ఆగస్టు నెలలో జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలతోపాటు పల్లె, బస్తీ దవాఖానలకు పరీక్షలు చేయించుకోవడానికి 50,271 మంది వెళ్లారని వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వారిలో జ్వరపీడితులు, డయేరియా, టైఫాయిడ్, డెంగీ, జలుబు తదితర సమస్యలు ఉన్నవారే అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
టెలీఫాస్ కీటక నాశిని మందు స్ప్రే..
డెంగీ, మలేరియా సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో దోమల లార్వాలను నిర్మూలించడానికి టెలీఫాస్ అనే కీటక నాశిని మందును స్ప్రే చేస్తున్నట్లు జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి మాడిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట సబ్ యూనిటర్ల పరిధిలో దోమల నివారణ కోసం పైరిత్రమ్, ఆల్ఫా సైఫర్ మిత్రేన్ (5 శాతం)తో పాటు టెలిఫాస్ మందులను అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతీ పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ పరిధిలో మలేరియా వ్యాధి నిర్ధారణ కోసం ఆర్‌టీడీ కిట్లు, వ్యాధి నివారణ మందులను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రజలు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చి వడబోసిన నీటిని మాత్రమే తాగాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూడాలని వారు సూచిస్తున్నారు.
రాపిడ్ రెస్పాన్స్ టీంలు
ఏర్పాటు చేశాం..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం జిల్లా, మండల (పీహెచ్‌సీ), సబ్‌సెంటర్ల వారీగా రాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్‌శాఖ, పట్టణాల్లో మున్సిపల్ అఽధికారుతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సీజన్‌లో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. పనిచేసే చోట ఉంటూ సమయపాలన పాటించడంతో పాటు సత్వర వైద్య సేవలు అందించడానికి సిద్ధం కావాలి. పాము, తేలు, కుక్కకాటుతోపాటు అవసరమైన అన్ని మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయి. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాం.
– బి.సాంబశివరావు,
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి
జిల్లాలో మూడు నెలల్లో నమోదైన కేసుల వివరాలు..
పొంచి ఉన్న డెంగీ, మలేరియా, అతిసార
ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు
పెరుగుతున్న జ్వరపీడితుల సంఖ్య
జాగ్రత్తలు పాటించాలంటున్న
వైద్యాధికారులు
నెల డెంగీ డయేరియా మలేరియా టైఫాయిడ్ జ్వరం జలుబు
జూన్ 11 67 0 71 105 67
జూలై 14 219 1 85 421 126
ఆగస్టు 55 391 1 94 802 314
80 677 2 250 1,328 507

వ్యాధుల కాలం జాగ్రత్త..

వ్యాధుల కాలం జాగ్రత్త..