
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
గీసుకొండ: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ)లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ హెచ్చరించారు. కేఎంటీపీలో అక్రమంగా వెలసిన షాపులను గురువారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. గుండుంబా, మాదకద్రవ్యాల అమ్మకం, బెల్టుషాపులు నిర్వహిస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ మహేందర్, సంగెం ఎస్సై నరేశ్, సిబ్బంది ఉన్నారు.
నేడు ఉత్తమ టీచర్లకు అవార్డుల ప్రదానం
విద్యారణ్యపురి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఖిలా వరంగల్ మండలం ఉర్సుగుట్ట సమీపంలోని ఆకుతోట కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. జిల్లాలో 52 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, 16 మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఉత్తమ టీచర్లుగా ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ తదితరులు పాల్గొంటారని డీఈఓ తెలిపారు.
నేడు రేషన్ షాపుల బంద్
ఖిలా వరంగల్: తెలంగాణ రేషన్ డీలర్ల అసోసియేషన్ రేషన్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని 509 రేషన్ షాపులు మూతపడనున్నాయి. ఎన్నికలకు ముందు తమకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన 21 నెలలు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా ధారావత్ మోహన్‌నాయక్ పేర్కొన్నారు. డీలర్ల కుటుంబాలకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఐదు నెలలుగా రేషన్ షాపుల్లో పాడైపోతున్న దొడ్డు బియ్యం నిల్వలను తరలించేందుకు నిర్ణయం తీసుకోవాలని, క్వింటాలుకు రూ.140 నుంచి రూ.300కు కమీషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఒక రోజు బంద్‌తోనైనా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని మోహన్‌నాయక్ హెచ్చరించారు.
7న భద్రకాళి దేవాలయం మూసివేత
హన్మకొండ కల్చరల్ : భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున భద్రకాళి దేవాలయాన్ని ఆరోజు మధ్యాహ్నం 1 గంటకు పూజల అనంతరం మూసివేయనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణమోక్షానంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి సోమవారం ఉదయం 7 గంటలకు భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.
హసన్‌పర్తి: ఎస్సారెస్పీ జలాలు గురువారం సాయంత్రం జిల్లాకు చేరాయి. చివరి (ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు) ఆయకట్టు వరకు నీరందించనున్నట్లు అధికారులు తెలిపారు. లోయర్ మానేరు నుంచి 3,000 క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు, వార బందీ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.