
నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి
● ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్
సంగెం: వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ ఆదేశించారు. ఎల్గూర్‌రంగంపేట చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మండల పరిధిలో 166 వినాయక విగ్రహాల నిమజ్జనానికి చెరువుల వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. చిన్న పిల్లలు, ఈతరాని వారు నిమజ్జనం సమయంలో చెరువుల వద్దకు వెళ్లకుండా చూడాలని, ఈత వచ్చిన వారిని మాత్రమే చెరువుల వద్దకు పంపించాలని కమిటీలకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారి డీజేలు సీజ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. డీజేలు కాకుండా బ్యాండ్‌మేళాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ఊరేగింపు చేసుకోవాలని, నిమజ్జనం రాత్రి 10 గంటల వరకు ముగించాలని కమిటీలను కోరారు. కార్యక్రమంలో మామునూరు ఏసీపీ వెంకటేశ్, సంగెం ఎస్సై నరేశ్, మాజీ సర్పంచ్ జనగాం రమేశ్ పాల్గొన్నారు.
కట్టమల్లన్న చెరువు వద్ద ఏర్పాట్ల పరిశీలన..
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం కట్టమల్లన్న చెరువు వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను ఈస్ట్‌జోన్ డీసీపీ ఐపీఎస్ అంకిత్ కుమార్ గురువారం సాయంత్రం పరిశీలించారు. వినాయకుడిని శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. చెరువులో వదిలే తెప్ప, క్రేన్, జేసీబీల ఏర్పాటును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ మహేందర్, పోలీసు, బల్దియా, రెవెన్యూ, దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.