
యూరియా కోసం వెతలు
● ధర్మరావుపేటలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతులు
ఖానాపురం: యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మరావుపేట, మంగళవారిపేట గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. మంగళవారిపేటలో 444, ధర్మరావుపేటలో 444 బస్తాల యూరియాను గురువారం రైతులకు పంపిణీ చేశారు. మంగళవారిపేటలో క్యూలో ఉన్న వారికి బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహించారు. గోదాం లోపలకు వెళ్లి వ్యవసాయ విస్తరణ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల వద్ద ఉన్న డబ్బులను లాగేయడంతో కిందపడిపోయాయి. దీంతో అప్రమత్తమైన సొసైటీ సిబ్బంది డబ్బులను తీసి బ్యాగులో పెట్టారు. గోదాంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకునే క్రమంలో అప్రమత్తమైన ఎస్సై రఘుపతి రైతులను బయటకు పంపించారు. షటర్ మూసివేసి క్యూలో ఉన్న వారికి బస్తాలను అందించేలా చర్యలు చేపట్టారు. ధర్మరావుపేటలో క్యూలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో మహిళా రైతులు కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు. గాయపడిన రైతులు గుగులోత్ వినోద, ఊడుగుల సునీత, దేవక్కతోపాటు మరికొంత మందిని కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు తరలించారు.
రైతులకు అండగా నిలిచిన ఎస్సై రఘుపతి
యూరియా కోసం మంగళవారిపేటకు చెందిన రైతులు దుప్పట్లతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే సొసైటీ గోదాం వద్ద బారులు తీరారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఛాగర్ల రఘుపతి రైతుల వద్దకు వెళ్లారు. రాత్రి సమయంలో రైతులు ఇబ్బందిపడొద్దని ఆలోచించారు. రాత్రి 12 గంటల కు రైతుల ఆధార్‌కార్డులు తీసుకున్నారు. సీరియల్ ప్రకారం తీసుకుని రైతులను ఇంటికి పంపారు. గురువారం ఉదయం కార్డుల ప్రకారం రైతులకు యూరియా పంపిణీ చేయించారు. దీంతో రైతులు ఎస్సైకి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన గ్రామాల రైతులు కూడా ఎస్సై వద్దకు వచ్చి ఇదే పద్ధతి అమలు చేయాలని కోరారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

యూరియా కోసం వెతలు