
నగరంలో వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ !
సాక్షి, వరంగల్: ఆధ్యాత్మికతకు నెలవైన వరంగల్ నగరం ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా వేదికయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పర్యాటక సుందరీకరణలో భాగంగా భద్రకాళి బండ్ అందుబాటులోకి రాగా.. మరోవైపు ఉర్సు గుట్టను కూడా టూరిజం హబ్ దిశగా తీసుకెళ్తున్నారు. వీటికి దీటుగా మామునూరు విమానాశ్రయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుట్ట నుంచి గుట్ట మధ్యలో ఉండేలా ఆనాడు కాకతీయులు నిర్మించిన దామెర చెరువును వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్‌గా మార్చాలని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆలోచన చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్లను అధ్యయనం చేయడం ద్వారా ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదనలు రూపొందించింది. దామెర చెరువుకు సంబంధించిన స్థలం కుడాకు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు లేఖ రాశారు. సంబంధిత విభాగాధికారులతో కలిసి అక్కడ చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేపల ద్వారా ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యామ్నాయం చూపించి, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ చేస్తే బాగుంటుందనే చర్చ వచ్చింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ప్రజాప్రతినిధులతోపాటు అటు అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
దామెర చెరువులో ఏర్పాటుకు ‘కుడా’ ప్రతిపాదనలు
కార్యరూపం దాలిస్తే ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్
హైదరాబాద్ తరహాలో జలక్రీడలతో ఉల్లాసానికి చాన్స్
భూమి ఇవ్వాలని కలెక్టర్ సత్యాశారదకు ఇప్పటికే లేఖ
సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు