
ఈసారి ఆలస్యమే!
ప్రతీ ఏడాది ఇదే తంతు..
చేపపిల్లల టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
● రెండేళ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
● జిల్లాలో పేరుకుపోయిన రూ.1.50 కోట్ల బకాయిలు
● ఈ నెల 30 వరకు టెండర్లు వేయడానికి చివరి తేదీ
జిల్లాలో మొత్తం చెరువులు : 702
మొత్తం చెరువుల నీటి విస్తీర్ణం : 12,910 హెక్టార్లు
చెరువుల్లో వదలాల్సిన చేపపిల్లలు : 1.90 కోట్లు
మత్స ్య సంఘాలు : 184
మత్స ్య సంఘాల్లోని సభ్యులు : 15,741 మంది
గీసుకొండ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసే ప్రక్రియ ఈ ఏడాది కూడా ఆలస్యం కానుంది. అసలు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈనెల18 నుంచి 30 వ రకు టెండర్లు దాఖలు చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఇటీవల రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈవిషయమై ఆన్‌లైన్‌లో టెండర్ల దరఖాస్తులు స్వీకరించడానికి మ త్స్యశాఖ సిద్ధం కాగా..కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గడిచిన రెండేళ్ల నుంచి తమకు రావాల్సిన బకాయిలను చెల్లిస్తేనే ముందుకు వస్తామని వారు అంటున్నారు. తమవద్ద కనీసం టెండర్ దరఖాస్తు చేసేందుకు డబ్బులు లేవని వారు వాపోతున్నారు. ఈవిషయమై తమకు రావాల్సిన బకా యిలను తక్షణమే ఇప్పించాలంటూ పలు జిల్లాల కాంట్రాక్టర్లు గురువారం హైదరాబాద్‌లోని మత్స్యశాఖ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. జిల్లా పరంగా చూస్తే కాంట్రాక్టర్లకు రెండేళ్లకు సంబంధించిన సుమారు రూ.1.50 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెబుతున్నారు.
సరైన సమయంలో వదిలితేనే ఎదుగుదల..
ఉచిత చేపపిల్లల పంపిణీలో ఆలస్యం చేస్తే తగిన లబ్ధి చేకూరడం లేదని,మత్స్యకారులు చెబుతున్నా రు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు చేపలు ఎదగాలంటే చేపపిల్లలను ఆగస్టులోపు చెరువుల్లో వదలాల్సి ఉంటుందని,అప్పుడే నాలుగు నెలల్లో వాటి వృద్ధిచెంది చేతికొస్తాయని చెబుతున్నారు. అలాంటి చేపలకు మార్కెట్‌లో మంచి ధర వస్తుందని,వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ, గతంలో ఆలస్యంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో సరిగా ఎదుగుదల లేక మత్స్యకారులకు పెద్దగా లాభం చేకూరలేదు.
గత ఏడాది సగం చేపపిల్లలే పంపిణీ
గత ఏడాది వర్షాకాలంలో జిల్లాలోని చెరువుల్లో లక్ష్యం మేరకు కాకుండా అందులో సగమే చేపపిల్ల లను మత్స్య సంఘాలకు పంపిణీ చేశారు. జిల్లాలో సుమారు 1.93 కోట్ల చేపప్లిలను పంపిణీ చేయాల్సి ఉండగా అందులో సగమే.. అదికూడా చాలా ఆలస్యంగా పంపిణీ జరిగిందని మత్య్ససంఘాల నాయకులు అంటున్నారు. గత ఏడాది రెండు ఏజెన్సీలు టెండర్లను దక్కించుకుని చేపపిల్లలను అందించాయి. అయితే, చేపపిల్లలు చాలా చిన్న సైజులో నాసిరకంగా ఉండడం, అదును దాటిన తర్వాత ఆలస్యంగా చెరువుల్లో పోయడంతో పెద్దగా ఎదగలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు నష్టం తప్ప లాభం రాదని చెబుతున్నారు. పలు మత్స్యసంఘాల వారు ఇప్పటికే ప్రైవేట్‌లో కొనుగోలు చేసి చెరువుల్లో చే పపిల్ల లను వదిలారు. నగదు బదిలీ చేస్తే తామే మేలైన రకం చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో పోసుకుంటామని వారు పేర్కొంటున్నారు,
వంద శాతం సబ్సిడీపై 2016లో ఉచిత చేపపిల్ల ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సకాలంలో ఏ ఒక్క ఏడాది కూడా చెరువులకు చేప పిల్లలు చేరిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా చేపపిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియ తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో టెండర్లను ఖరారు చేయాల్సి ఉండగా ప్రతీ ఏడాది ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో చేపపిల్లల సరఫరా, చెరువుల్లో పోయ డం అలస్యం అవుతోంది. అయితే, వచ్చే నెల ఒకటో తేదీన టెండర్లు తెరుస్తామని, అప్పుడు ఎవరు టెండర్లు వేశారో తెలుస్తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి నాగమణి తెలిపారు.