సాక్షిప్రతినిధి, వరంగల్ :
‘భారత్ మాల’ప్రాజెక్టు గ్రేటర్ వరంగల్‌కు వరంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన జాతీయ రహదారులు వరంగల్ నగరాన్ని తాకేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే భువనగిరి – ఆరెపల్లి నేషనల్ హైవే పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. సిద్దిపేట – ఎల్కతుర్తి (765 డీజీ) హైవే రూ.578 కోట్లతో 64 కి.మీ.లు పూర్తి చేశారు. ఆ రోడ్డు సైతం 563 ఎన్‌హెచ్ నుంచి వరంగల్ ఔటర్ రింగు రోడ్డును తాకేలా డిజైన్ చేశారు. జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 563) నిర్మాణ పనులు సగం వరకు పూర్తయ్యాయి. తాజాగా వరంగల్ – ఖమ్మం నేషనల్ హైవేను సైతం భారత్ మాల కింద ఫోర్‌లేన్ రోడ్డుగా మార్చనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. వీటికి తోడుగా నాగపూర్– విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే వరంగల్ మీదుగానే వెళ్తుండడంతో గ్రేటర్ వరంగల్ జాతీయ రహదారులకు సెంటర్ పాయింట్ కానుంది. త్వరలోనే ఎయిర్‌పోర్టు రానుండడం... ఎన్‌హెచ్‌ల అనుసంధానంతో రవాణా పరంగా వరంగల్‌కు ఉపయోగం కలగనుంది.
ఔటర్ రింగ్ రోడ్డుతోనూ లింకు..
కరీంనగర్ – వరంగల్ మధ్యన ఈ రహదారి పొడవు 68.34 కిలోమీటర్లు కాగా, రూ.2,164 కోట్లతో ఈ పనులు సాగుతున్నాయి. గ్రేటర్ వరంగల్‌ను తాకుతూ వెళ్తున్న మంచిర్యాల–విజయవాడ జాతీయ రహదారికి.. మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 112 కి.మీ.లు, రూ.2,490 కోట్లు కేటాయించారు. మంచిర్యాల నుంచి మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర మీదుగా వెళ్లే రోడ్డు పనులు మొదట భూసేకరణ వల్ల ఆలస్యమైనా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. వరంగల్ – ఖమ్మం మధ్య రహదారి 107 కి.మీ.ల కోసం రూ. 2,249 కోట్లు కేంద్రం కేటాయించగా, 1,410 ఎకరాల భూసేకరణ ప్రకియ జరిగింది. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో ఉండే ఈ రహదారి.. గ్రేటర్ వరంగల్ విలీన ప్రాంతాలతోపాటు ఊరుగొండ, గీసుకొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం తదితర ముఖ్య పట్టణాలను తాకుతుంది. 765 డీజీగా పేరున్న సిద్దిపేట – ఎల్క తుర్తి రోడ్డు పొడవు 64 కి.మీ.లు కాగా.. ఈ రోడ్డు కోసం రూ.578 కోట్లు కేటాయించారు. ఆ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా.. సిద్దిపేట, హుస్నాబాద్, ఎల్కతుర్తి ద్వారా వరంగల్‌కు చేరుకుంటున్నారు. ఐదేళ్ల కిందట అప్పటి సీఎం కేసీఆర్ సంగెం వద్ద శంకుస్థాపన చేశారు. వరంగల్ నూతన మాస్టర్‌ప్లాన్‌లో కొత్త ప్రాజెక్టు రీజినల్ ఔటర్ రింగురోడ్డు నగర శివారు నుంచి వెళ్లే ఐదు జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేసేలా డిజైన్ చేసినా పెండింగ్‌లో ఉంది. సుమారు 135 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ ఓఆర్‌ఆర్ కూడా అసంపూర్తిగా ఉంది. తక్షణమే ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌లకు నిధులు విడుదల చేసి పూర్తి చేస్తే.. ఐదు జాతీయ, రాష్ట్ర రహదారులతో గ్రేటర్ వరంగల్‌కు మహర్దశ పట్టనుంది.
నగరాభివృద్ధికి దోహదం
నగరం చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల విస్తరణతోపాటు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే నగరాభివృద్ధికి ఎంతగానే తోడ్పడతాయి. భారీ ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాలు నగరంలోకి వెళ్లకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు నగరానికే మణిహారంగా నిలుస్తుంది.
– మేరుగు అశోక్, శివనగర్, వరంగల్
రవాణా వ్యవస్థ బలోపేతం..
రహదారుల నిర్మాణం వల్ల నగరంలో వాణిజ్య కార్యకలాపాలు అధికంగా పెరుగుతాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో నగరంలో ట్రాఫిక్ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఇప్పటికే టెక్స్‌టైల్ పార్క్ ఉంది. మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా మామునూరు ఎయిర్‌పోర్ట్ట్ పూర్తి చేస్తే వాణిజ్యంగా అభివృద్ధి చెందుతుంది.
– గడ్డం రవి, వరంగల్
కొత్త పరిశ్రమలకు అవకాశం
జాతీయ రహదారుల వల్ల వరంగల్ నగరం వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతుంది. రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం ఉంది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయి.
– రామచంద్రారెడ్డి, రైతు, హసన్‌పర్తి
తాజా నిర్ణయంతో ఫోర్ లేన్ రోడ్డుగా వరంగల్–ఖమ్మం హైవే
మామునూరు ఎయిర్‌పోర్ట్‌కూ
కొత్త రోడ్డు
స్పీడ్‌గా మంచిర్యాల – విజయవాడ, వయా వరంగల్
గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో వేగం
జాతీయ రహదారులకు వరంగల్ మహానగరం అనుసంధానం
జాతీయ రహదారులకు వరంగల్ మహానగరం అనుసంధానం
జాతీయ రహదారులకు వరంగల్ మహానగరం అనుసంధానం