
అభివృద్ధి కోసమే ‘పనుల జాతర’
ఎల్కతుర్తి: వివిధ అభివృద్ధి పనుల్ని పూర్తి చేసేందుకే పనుల జాతర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం మాల్లారంలో రూ.12 లక్షలతో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వీర్లగడ్డ తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. వీరభద్రస్వామి దేవాలయంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగానే హుస్నాబాద్ నియోజకవర్గంలో సుమారు 46 పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నట్లు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడం తన బాధ్యత అని, అనాడు ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, ఈనాడు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియకు రైతులు సహకరించాలని కోరారు. వీర్లగడ్డ తండాలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అధికారులు, స్థానికులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. స్థానికులు బస్సు, తాగునీటి సౌకర్యాల గురించి మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ డెరెక్టర్ సురేశ్‌బాబు, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓ రమేశ్ రాఽథోడ్, పంచాయతీ రాజ్ ఈఈ ఆత్మారాం, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం
మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్