
కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా గుణశేఖర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా గుణశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్న గుణశేఖర్‌ను రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు బదిలీ చేసింది. ఈసందర్భంగా పోలీస్ అధికారులు నూతన డీసీపీని మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలు అందించారు.
కాకతీయ జూపార్కుకు
ట్రెయినీ బీట్ ఆఫీసర్లు
న్యూశాయంపేట: ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లిలో శిక్షణ పొందుతున్న 37వ బ్యాచ్‌కు చెందిన 40 మంది ట్రెయినీ బీట్ ఆఫీసర్లు ఒక రోజు శిక్షణలో భాగంగా సోమవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జువలాజికల్ పార్క్‌కు వచ్చారు. వీరికి జూ పార్క్ ఇన్‌చార్జ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మయూరి, ఇతర పార్క్ అధికారులు చిరుతల సంరక్షణ, తెల్లపులి సంరక్షణ, వాటి ఆహార నియమాలు తదితర అంశాలపై వివరించారు. అలాగే పార్క్‌లోని శాఖాహార జంతువులు, పక్షులు, ఇతర జంతువుల సంరక్షణ విధానం ఆహారం, పార్క్ సిబ్బంది విధుల గురించి తెలిపారు.
ఆధ్యాత్మికతలో జీవించాలి
హన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని వారణాసి సంత్ రవిదాస్ ఆశ్రమం పీఠాధిపతి ఆచార్య భరత్‌భూషణ్‌దాస్ ఉద్బోధించారు. సోమవారం వెయ్యి స్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా వారిని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతించారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించుకున్న అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. ఈఓ అనిల్‌కుమార్ ఆచార్యులకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను పండ్లను అందజేశారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా చివరి సోమవారం స్వామివారిని సర్పరుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రీ రిపబ్లిక్ డే
శిబిరానికి వలంటీర్ల ఎంపిక
కేయూ క్యాంపస్: గుజరాత్ పాటన్ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 31 నుంచి నిర్వహించనున్న ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు కేయూలో సోమవారం ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను ఎంపిక చేశారు. ఇందులో కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డి నేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ కార్యాలయం సూపరింటెండెంట్ సంజయ్, కేయూ పరిధి ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆర్.ప్రవీణ్‌కుమార్, అశోక్ మోరె, పిరాధిక, దత్తాత్రేయ, సతీశ్‌చంద్ర, వలంటీర్లు పాల్గొన్నారు.