
రైతులకు యూరియా తిప్పలు
కమలాపూర్: రైతులను యూరియా కష్టాలు వెంటా డుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకుని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చున్నా యూరియా దొరకడం గగనంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు పూర్తయి యూరియా అత్యవసరమైంది. కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సోమవారం 888 బస్తాల యూరియా రాగా, సమాచారం అందుకున్న రైతులు వేకువ జామునుంచే పీఏసీఎస్ గోదాం వద్దకు చేరుకున్నారు. సుమారు 1,500 మందికి పైగా రైతులు వర్షంలోనే బారులుదీరగా.. మరి కొందరు క్యూలైన్‌లో చెప్పులు పెట్టారు. గత ఐదారు రోజు లుగా యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో వచ్చిన స్టాక్‌లో సగానికిపైగా పోలీసు పహారాలో పంపిణీ చేశారు. తర్వాత ఈ–పాస్ సర్వర్ మొరాయించడంతో సు మారు 300 బస్తాల యూరియా పంపిణీ నిలిచిపోయింది. అందుబాటులో ఉన్న యూరియా వరకు రైతులకు టోకెన్లు జారీ చేసి మంగళవారం పంపిణీ చేస్తామని చెప్పి పంపించారు. యూరియా, టోకెన్లు దొరకని పలువురు రైతులు నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ఎండనకా, వాననక గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
ఓ వైపు రైతుల బారులు..
మరో వైపు క్యూలైన్‌లో చెప్పులు
ఈ–పాస్ పనిచేయక సగంలోనే
నిలిచిన పంపిణీ