
ప్రయాణికులను రక్షించిన సీఐ సాయిరమణ
ఖానాపురం: వరద నీటిలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని దుగ్గొండి సీఐ సాయిరమణ కాపాడారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన బాస లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, రితిక, రితిన్ భద్రాచలానికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో చిలుకమ్మనగర్–కొత్తగూడ మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకుపోయారు. వెంటనే లక్ష్మీనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. డీజీ కంట్రోల్ కార్యాలయం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో దుగ్గొండి సీఐ సాయిరమణ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు చిలుకమ్మనగర్‌కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పంటలకు సరిపడా యూరియా : డీఏఓ
నెక్కొండ: పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవపరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి అనురాధ అన్నారు. చంద్రుగొండ పీఏసీఎస్ ఉప కేంద్రంలో యూరియాను శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యూరియా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే ఫర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, చంద్రుగొండలోని వట్టె వాగు లోలెవల్ కాజ్‌వే, సీతారాంపురం మాటు, పెద్దకొర్పోలు లొట్ల వాగును పరిశీలించారు. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వాగులు, చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డీఏఓ సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.
శాంతివనంలో
కలిమి కాయలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శాంతివనంలో కలిమి కాయలు ఈసారి విరగ కాశాయి. వీటిని వాక్రాయలు, కరెండ అనే పేర్లతో కూడా పిలుస్తారని వనప్రేమి గోకా రామస్వామి తెలిపారు. ఈ కాయలతో రోటి పచ్చడే కాకుండా నిల్వ పచ్చడి కూడా చేస్తారని పేర్కొన్నారు. కిలో రూ.50 ఉన్న టమాట బదులు ఐదుఆరు కాయలు పప్పులో వేసుకుంటే ఆ రుచే వేరని వివరించారు. ఇందులోని సీ విటమిన్ ఆరోగ్య ప్రదాయినిగా ఉపయోగపడుతుందని రామస్వామి పేర్కొన్నారు. రైతులు ఈ మొక్కలను జీవ కంచెగా చేను చుట్టూ నాటుతారని, వీటికి ఉన్న మూడు ఇంచుల ముల్లులతో పాములు కూడా చొరబడవని తెలిపారు. విరగకాసిన కాయలు శాంతి వనానికి అందం తెచ్చాయని చెప్పారు.
భూ పరిహారం రూ.5కోట్లు పెంచి ఇవ్వాలి
ఖిలా వరంగల్: మామునూరు ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.5కోట్ల పరిహారం పెంచాలని, లేనిపక్షంలో భూమికి బదులు భూమి ఇవ్వాలని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు డిమాండ్ చేశారు. శనివారం వరంగల్–నెక్కొండ రోడ్డుపై గుంటూరుపల్లి వద్ద ఎయిర్‌పోర్ట్ భూ బాధిత రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విలువైన భూమికి ఎకరానికి రూ.5కోట్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని, భూములను రీసర్వే చేసి పరిహారం పెంచి ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో రైతులు కాలశ్రీ ప్రసాద్, కొత్తపల్లి భద్రయ్య, వంకటి శ్రీనివాస్, రత్తయ్య, సుబ్బారావు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

ప్రయాణికులను రక్షించిన సీఐ సాయిరమణ

ప్రయాణికులను రక్షించిన సీఐ సాయిరమణ

ప్రయాణికులను రక్షించిన సీఐ సాయిరమణ