
జనగామ జిల్లా: ఉడతతో రూ.2లక్షల ఆస్తినష్టం జరిగిందంటే నమ్మశక్యంగా లేదుకదా.. కానీ వాస్తవం. అంతేకాదు.. పలు గ్రామాలకు నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని కెపాసిటర్ సెల్స్‌లోకి ఉడుత చేరడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు చెలరేగి ఉడుత మృతిచెందడంతో పాటు రెండు కెపాసిటర్ సెల్స్, కెపాసిటర్ ప్యానల్ బోర్డు, రెండు బ్యాటరీ చార్జర్లు, రెండు రిలేలు, 20 మీటర్ల బ్రేకర్స్ కేబుల్ కాలిపోయాయి.
దీంతో సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకుని జనగామ నుంచి వచ్చిన ఎంఆర్‌టీ, టీఆర్‌ఈ బృందాలు దాదాపు మూడున్నర గంటలపాటు శ్రమించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఉడుత కెపాసిటర్ సెల్స్‌లోకి దూరడంతో రూ. 2 లక్షల మేర నష్టం జరిగినట్లు గుర్తించారు. అరె.. ఉడత ఎంత పనిచేశావ్ అంటూ గొణుక్కోవడం విద్యుత్ సిబ్బంది వంతైంది.