
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సత్యశారద
నర్సంపేట/నల్లబెల్లి/ఖానాపురం: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ శివారులో రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరద, నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి వాగు, నర్సంపేట నుంచి చెన్నారావుపేట వెళ్లే రహదారిలో మగ్ధుంపురం వద్ద లోలెవల్ కాజ్‌వే, నర్సంపేటలోని మాదన్నపేట వద్ద కాజ్‌వేను శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. కాజ్‌వేల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ వాతావరణ శాఖ జిల్లాకు ప్రకటించిన ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్‌గా మారే సూచనలు ఉన్న నేపధ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విపత్కర పరిస్థితి ఎదురైతే ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాగులు, కాల్వలను దాటే ప్రయత్నం చేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, పోలీసుల నిఘా ఉండాలని ఆదేశించారు. డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, జిల్లా పంచాయతీ అధికారి కల్పన పాల్గొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సత్యశారద