
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
న్యూశాయంపేట: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్టితులను ఎదుర్కోడానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గౌతంరెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ రవి, జిల్లా అఽధికారులు పాల్గొన్నారు.
ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలి : డీఏఓ
నర్సంపేట రూరల్: ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ ఆదేశించారు. నర్సంపేట పట్టణంలో ఎరువుల దుకాణాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనురాధ మాఽట్లాడుతూ రైతులు పంటలకు నానో యూరియా వాడాలని, అవసరం ఉంటేనే పురుగుమందులు కొనుగోలు చేయాలని కోరారు. తనిఖీల్లో మండల వ్యవసాయాధికారి కృష్ణకుమార్, వ్యవసాయ విస్తరణాధికారి అశోక్, వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆర్‌యూబీలో వర్షపు నీరు.. ఊపిరాడక ఎద్దు మృతి
నెక్కొండ: ఆర్‌యూబీలో నిలిచిన వర్షపు నీటిలో ఊపిరాడక ఓ ఎద్దు మృతి చెందిన సంఘటన గుండ్రపల్లి గ్రామంలో గురువారం జరిగింది. బాధిత రైతు బైరు ఎల్లయ్య కథనం ప్రకారం.. గ్రామంలోని వ్యవసాయ పనుల నిమిత్తం దుక్కిటెద్దులను తీసుకెళ్తున్నాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ)లో భారీగా నీరు చేరింది. దుక్కిటెద్దు నీటిలో ఊపిరి ఆడక మత్యువాత పడింది. సుమారు రూ.60 వేల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఎద్దు మృతికి కారణమని ఆయన ఆరోపించాడు. రైల్వే ట్రాక్ అవతల ఉన్న పంట చేలకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నాడు.
వాగులో పడిన ద్విచక్రవాహనదారులు
● ఒకరు మిషన్ భగీరథ పైపుతో, మరొకరు చెట్టు సాయంతో
క్షేమంగా బయటకు..
● బారికేడ్లతో రహదారిని
మూసివేయించిన పోలీసులు
● నాజీతండాశివారులో ఘటన
ఖానాపురం: మండలంలోని నాజీతండాశివారులో వాగులో ద్విచక్రవాహనదారులు పడిపోయిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు గ్రామానికి చెందిన నీలం సూరయ్య, వేలుబెల్లి గ్రామానికి చెందిన బొజ్జ వినయ్‌కుమార్ పనుల నిమిత్తం నర్సంపేటకు వచ్చారు. పనులు ముగించుకుని నాజీతండా మీదుగా వెళ్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నం చేశారు. దీంతో వేర్వేరుగా ఇద్దరు వాగులో ద్విచక్రవాహనాలతో సహా పడిపోయారు. వినయ్‌కుమార్ వాగులో ఉన్న మిషన్ భగీరథ పైపుద్వారా బయటకు రాగా, సూరయ్య కొద్ది దూరం కొట్టుకుపోయి చెట్టు సాయంతో బయటకు వచ్చారు. ఇరువురి ద్విచక్ర వాహనాలతోపాటు సెల్‌ఫోన్లు వాగులో కొట్టుకుపోయాయి. ఎస్సై రఘుపతి సంఘటనా స్థలం వద్దకు వెళ్లి వాహనదారులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అప్పటికే అక్కడ పెట్టిన బారికేడ్‌లతో రహదారిని పూర్తిగా మూసివేయించారు. వాహనదారులు భూపతిపేట మీదుగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి