
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
● నేడు కోటలో జెండాను ఆవిష్కరించనున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
● ఖుష్‌మహల్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: జిల్లా కేంద్రంలోని మధ్యకోట ఖుష్‌మహల్ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించనున్న 79వ భారత స్వాతంత్య్ర వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద పర్యవేక్షణలో కాకతీయుల రాజధాని ఖుష్‌మహల్ మైదానంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీలు అంకిత్‌కుమార్, షేక్‌సలీమా, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, వరంగల్ ఏసీపీ శుభం, వరంగల్, ఖిలావరంగల్ తహసీల్దార్లు ఇక్బాల్, బండి నాగేశ్వర్‌రావుతో కలిసి కలెక్టర్ సత్యశారద గురువారం సాయంత్రం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వేడుకలు నిర్వహించాలన్నారు.
9.30 గంటలకు జెండావిష్కరణ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 9.25 గంటలకు ఖుష్‌మహల్ చేరుకుంటారు. 9.30 గంటలకు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. 9.35 నుంచి 10.55 గంటల వరకు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, శకటాల ప్రదర్శన అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగించి స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉత్తమ సేవలందించిన వారిని సన్మానిస్తారని కలెక్టర్ సత్యశారద తెలిపారు.

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం