
భూ భారతిపై అసెంబ్లీలో నిలదీస్తాం..
● మాజీ మంత్రి హరీశ్‌రావు
గీసుకొండ: ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని, ఈ విషయమై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం నర్సంపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న ఆయన మార్గమధ్యలో గీసుకొండ మండలం కొనాయమాకుల వద్ద మాజీ జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు నివాసంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి తేనేటి విందు స్వీకరించారు. అనంతరం విలేకరులు, కార్యకర్తలు, రైతులతో ఇష్టాగోష్టిగా మాట్టాడారు. తమ ప్రభుత్వం గృహలక్ష్మి కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాల విషయంలో సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ విషయమై కోర్టులో కేసు దాఖలు చేసి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని అభినందించారు. పంటచేలకు ఎరువులు, యూరియా అందించే విషయంలో సర్కారుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి ఎరువుల వాటాను తెప్పించే విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన తీరుపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని, రూ.2 లక్షలపైన రుణం ఉన్న వారు మిగతా మొత్తం చెల్లించినా మాఫీ కావడం లేదని రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆయన దృష్టికి తెచ్చారు. దసరా తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండి అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ సర్కారు అంటేనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వస్తాయని ఎద్దేవా చేశారు. ఎస్సారెస్పీ కాల్వ ద్వారా పంటలకు నీరు అందడం లేదని, రైతులకు అవసరమైన ఎరువులు అందకపోడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు పీఏసీఎస్ చైర్మన్లు హరీశ్‌రావు దృష్టికి తెచ్చారు.