
కొవ్వొత్తులతో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
ఖిలా వరంగల్: వరంగల్ చౌరస్తా నుంచి హెడ్‌పోస్టాఫీస్ వరకు ‘ఓట్ చోర్–గద్దె చోడ్’ నినాదంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ బిహార్ ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని రాహుల్‌గాంధీ ఆధారాలతో ప్రశ్నిస్తే కేంద్రం, ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపించారు. ఫిర్యాదు చేయండి.. పరిశీలిస్తామని ఎన్నికల కమిషన్ చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఒక్క నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు పెరగడం, ఒకే ఇంటి నంబర్‌పై 200 నుంచి 300 ఓటర్లు నమోదు కావడాన్ని పరిశీలిస్తే తప్పడు ఓట్లని అర్థమవుతుందని వివరించారు. ప్రపంచంలో 11 ఏళ్లుగా ప్రెస్‌మీట్ పెట్టని ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది మోదీనేనని, 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై అవాకులు, చెవాకులు మాట్లాడుతారని, గాంఽధీ కుటుంబం త్యాగాల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి ప్రధానిగా ఉండడం దురదృష్టం అని ఆమె అన్నారు. కార్పొరేటర్లు గుండేటి నరేందర్, బస్వరాజు శిరీష, శ్రీమాన్, మాజీ కార్పొరేటర్లు తత్తెర లక్ష్మణ్, బిల్లా శ్రీకాంత్, జన్ను రవి, దామెర సర్వేశం, నాయకులు గోరంటల రాజు, కరాటే ప్రభాకర్ పాల్గొన్నారు.