
మధ్యాహ్న భోజనాన్ని ‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దు
హన్మకొండ: వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయా మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన వర్కర్లు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో హ నుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి ఇంట్లోకి ప్రవేశించకుండా గేటు వేసి అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన వర్కర్ల మద్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసుల చర్యలను అడ్డుకున్నారు. సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి రమేశ్, నాయకులు వాణి, ప్రభాకర్, ఉపేందర్‌తో పాటు మధ్యాహ్న భోజన వర్కర్లను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన వర్కర్లు బైరబోయిన సరోజినీ యాదవ్, జారతి దేవి, కవిత, స్వర్ణలత, పుష్పలీల, రమ, మనెమ్మ, మల్లికాంబ, ఉమాదేవి, లక్ష్మి అనసూర్య, వనజ, సంధ్య, రీటా, సరిత, పద్మ, అరుణ, యాకలక్ష్మి, రజియా సుల్తానా, జఖియా బేగం, షంషాద్, ప్రమీల, శ్రావణి, మంజుల పాల్గొన్నారు.
మంత్రి ఇంటిని ముట్టడించిన
మధ్యాహ్న భోజన కార్మికులు