ఎంజీఎంలో పరీక్షల్లేవు! | - | Sakshi
Sakshi News home page

ఎంజీఎంలో పరీక్షల్లేవు!

Aug 10 2025 5:22 AM | Updated on Aug 10 2025 5:22 AM

ఎంజీఎ

ఎంజీఎంలో పరీక్షల్లేవు!

ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలోని ఓ విభాగంలో నెలకొన్న సమస్య పరిష్కరించేలోపే మరో సమస్య తెర మీదకు వస్తోంది. రాష్ట్ర స్థాయిలో రావాల్సిన కోట్లాది రూపాయల బడ్జెట్‌ రాకపోవడంతో ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రికి గతంలో రసాయనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు.. ప్రస్తుతానికి పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో రసాయనాలు సరఫరా చేయలేమంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా రసాయనాల లేమితో పలు రక్త పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు వందల సంఖ్యలో ప్రైవేట్‌కు తరులుతున్నారు. వందలాది రూపాయలు ఖర్చు చేస్తూ.. వైద్యం పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఈక్రమంలో రసాయనాల లేమికి తోడు ఓపీ విభాగంలో వందలాది మంది రోగులకు రక్త పరీక్షలు నిర్వహించే ఆటో ఎనలైజర్‌ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మూడు రోజులుగా ఎంజీఎం ఆస్పత్రిలో ఏయే రక్త పరీక్షలు చేస్తున్నారో, చేయడం లేదో అయోమయ స్థితి నెలకొంది. పేద రోగులను దోచుకునేందుకు దళారులు, కొంత మంది వైద్యులు ఎంజీఎం ఆస్పత్రిని అడ్డాగా చేసుకుని దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ప్రైవేట్‌ వైపు చూపు..

ఎంజీఎం ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో పరీక్షలు చేయకపోవడంతో వందలాది మంది రోగులు ప్రైవేట్‌కు పరుగులు పెడుతున్నారు. ఓ పక్క రసాయనాల లేమి.. మరో పక్క ఆటో ఎనలైజర్‌ పరికరంలో ఏ ర్పడిన సాంకేతిక లోపంతో ఆస్పత్రికి కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తున్న దళారులకు వరంగా మారింది.నిత్యం ఓపీ రోగులతో పాటు,ఐపీ రో గు ల వద్ద నుంచి స్వయంగా వార్డులోకి వచ్చి శాంపిళ్లు సేకరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈక్రమంలో డబ్బులు లేని పేద రోగులు వైద్యుడు రాసిచ్చిన మందులను తీసుకుంటూ తర్వాత చూద్దాం లే అంటూ సగం వైద్యంతో తిరిగి వెళ్తున్న పరిస్థితి.

ప్రైవేట్‌ ల్యాబ్‌లకు ఫోన్లు

ఎంజీఎం వైద్యులే ప్రైవేట్‌ ల్యాబ్‌ నిర్వాహకులకు ఫోన్లు చేస్తూ శాంపిళ్లు పంపిస్తున్నారు. ఈక్రమంలో ఏ ల్యాబ్‌కు తన ద్వారా ఎన్ని శాంపిళ్లు వెళ్లాయో.. ఎంత మేర కమిషన్‌ తీసుకోవాలో లెక్కలు వేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ నిర్వాహకుడు వార్డులోని రోగి వద్దకు వచ్చి స్వయంగా శాంపిల్స్‌ సేకరించిన ఘట నల చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎంజీఎంలో అదే తంతు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

నిలిచిన రక్త పరీక్షలివే..

ఎంజీఎం ఆస్పత్రిలో కీలకమైన రక్తపరీక్షలు నిలిచిపోవడంతో రోగులకు తిప్పలుతప్పట్లేదు.

● కిడ్నీ వ్యాధులకు తప్పనిసరిగా చేయాల్సిన ఆర్‌ఎఫ్‌టీ పరీక్షలు ప్రధాన ల్యాబ్‌లో కాకుండా ఎమర్జెన్సీ ల్యాబ్‌లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా బ్లడ్‌ యూరియా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ప్రైవేట్‌కు వెళ్లక తప్పడం లేదు. డయాలసిస్‌ రోగులకు ఈ పరీక్షలు తప్పనిసరి.

● సిరమ్‌ ఎలక్ట్రోలైడ్స్‌ను రోగి నడవలేని స్థితిలో మూర్ఛపోయే పరిస్థితుల్లో ఈ పరీక్షలు చేసి అత్యవసర చికిత్సలు అందించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా సోడియం, వాటర్‌ లెవల్స్‌, పొటాషియం, క్లోరైడ్‌ వంటి శాతాన్ని గ్రహించి సోడియం ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి కీలకమైన ఎలక్ట్రోలైడ్స్‌ పరీక్షలు నిలిచిపోయి రోజులు గడుస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు గత్యంతరం లేక ప్రైవేట్‌కు పరుగులు పెడుతున్నారు.

● లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షల ద్వారా మనిషిలో ఎంత కొలెస్ట్రాల్‌ ఉంది. ట్రైగ్జిజర్‌ ద్వారా రక్తంలో నూనె శాతం ఎంత? వంటి అంశాలను గుర్తించి వైద్యం అందిస్తారు. పరీక్షల్లో బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌, గుడ్‌ కొలోస్ట్రాల్‌ వంటి పరీక్షలు లేకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు

● సిరం బెలిరుబిన్‌ వంటి పరీక్షలతో ప్రాణాంతకమైన పసకలకు వైద్యం అందిస్తారు. ఇందులో చేయాల్సిన డైరెక్ట్‌, ఇన్‌డైరెక్ట్‌ శాతాల పరీక్షల కోసం రసాయనాల కొరతతో ఇలాంటి పరీక్షలు సైతం కావట్లేదు.

● రోగి జబ్బుతో బాధపడుతున్న సమయంలో ఏ మేరకు ప్రొటీన్లు ఉన్నాయో తెలుసుకునే సిరమ్‌ ప్రొటీన్‌లు పరీక్షలు సైతం నిలిచిపోయాయి. ఇలాంటి కీలకమైన పరీక్షలే కాకుండా ఇంకా పదుల సంఖ్యలో రక్త పరీక్షల కోసం రోగులు ప్రైవేట్‌కు పరుగులు పెట్టాల్సి వస్తుంది.

అందుబాటులోకి వస్తుంది..

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ ద్వారా గురువారం పలు రసాయనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆటో ఎనలైజర్‌ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించి అందుబాటులోకి తెస్తాం.

– కిశోర్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌

కాంట్రాక్టర్‌కు బిల్లులు

చెల్లించకపోవడంతో రసాయనాల

పంపిణీ నిలిపివేత

ఇదే అదునుగా

దండుకుంటున్న దళారులు

ఆటో ఎనలైజర్‌ పరికరంలో

సాంకేతిక లోపం

‘ప్రైవేట్‌’ను ఆశ్రయిస్తున్న రోగులు

నిండుకుంటున్న నిల్వలు..

ఎంజీఎంలో పరీక్షల్లేవు!1
1/2

ఎంజీఎంలో పరీక్షల్లేవు!

ఎంజీఎంలో పరీక్షల్లేవు!2
2/2

ఎంజీఎంలో పరీక్షల్లేవు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement