గత ప్రభుత్వ నిర్లక్ష్యం పేదలకు శాపం
సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి
హన్మకొండ అర్బన్: హనుమకొండ అంబేడ్కర్ కాలనీలోని పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, అర్హులైన పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఆరోపించారు. అంబేడ్కర్ కాలనీలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో 592 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, స్థానికంగా 20 నుంచి 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారికి ఇస్తామని చెప్పి, కేవలం 6 కుటుంబాలకు మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు చొరవ తీసుకొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్ పాల్గొన్నారు.
ఓరుగల్లు రంగస్థల కళాకారుల సంస్మరణ సభ
హన్మకొండ కల్చరల్: ఇటీవల మరణించిన వరంగల్‌కు చెందిన రంగస్థల కళాకారులు చక్రహరి సురేందర్‌రావు, బలగం ఫేం జీవీ బాబు, శతపతి శ్యామలరావు సంస్మరణ సభను వరంగల్ పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియంలో బుధవారం రాత్రి నిర్వహించారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన సభలో కళాకారులు ఎన్‌ఎస్‌ఆర్ మూర్తి, జేఎన్.శర్మ, ఓడపల్లి చక్రపాణి, శ్రీరామోజు సుందరమూర్తి, పందిళ్ల అశోక్‌బాబు, గూడూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


