డబుల్‌.. గుబుల్‌! | Sakshi
Sakshi News home page

డబుల్‌.. గుబుల్‌!

Published Tue, Apr 16 2024 1:00 AM

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల ఆవరణలో పిచ్చి మొక్కలు - Sakshi

కాజీపేట అర్బన్‌: పేదల సొంతింటి కల.. అలాగే మిగిలిపోతోంది. ఏళ్లుగా ఎదురు చూపులు తప్ప ప్రయోజనం లేకుండా పోతోంది. నగరానికి గుండె కాయవంటి కాజీపేట మండలం న్యూశాయంపేటలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. సొంతింటి కల సాకారం కోసం నిరుపేదలు ఏడాదికోసారి దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. అయినా నేటికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ అడుగు ముందుకు పడడం లేదు. 2018లో గత ప్రభుత్వం ఇక్కడ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పనులు రారంభించిన ఏడాదిలోపే నిర్మాణాల్ని పూర్తి చేసింది. అప్పటి నుంచి పేదలు తమకు ఇళ్లు కేటాయిస్తారని ఎదురుచూస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ ఇళ్ల పంపిణీ జరగలేదు.

అపరిశుభ్ర వాతావరణం..

న్యూశాయంపేటలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌లను అర్హులకు కేటాయించకపోవడంతో.. ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. విష సర్పాలు, కీటకాలు, వీధి కుక్కలు, కోతులకు ఇవి స్థిర నివాసంగా మారాయి. కాగా.. న్యూశాయంపేటకు చెందిన 42 మంది దళితులకు చెందిన 8.12 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించింది. తమకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ కేటాయించాలని దళితులు కోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నేటికీ దళితులకు ఇళ్ల కేటాయింపు జరగలేదు.

8.12 ఎకరాల్లో..

న్యూశాయంపేటలోని 8.12 ఎకరాల విస్తీర్ణంలో 19 బ్లాకులుగా విభజించి 608 ఇండ్లను నిర్మించారు. 608 ఇళ్లకుగాను ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అర్హులను ఎంపిక చేసి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కేటాయించాలని నిరుపేదలు కోరుతున్నారు.

తక్షణమే పంపిణీ చేయాలి

న్యూశాయంపేటలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను తక్షణమే దరఖాస్తు చేసుకున్న అర్హులకు కేటాయించాలి. నిరుపేదలు, గుడిసెవాసులు దుర్భర జీవితం గడుపుతున్నారు. వారిని ఆదుకోవాలి.

– పెరుగు సురేశ్‌, న్యూశాయంపేట

ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలి

మాకు ఒక్కొక్కరికి ఉన్న మేం సాగు చేసుకున్న ఏడు గుంటల భూమిని ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి తీసుకుంది. ప్రత్యామ్నాయ భూమిని కేటాయించడంతో పాటు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కేటాయించాలి.

– దండు దయాకర్‌, న్యూశాయంపేట

కోర్టు ఆదేశాల మేరకు ఇవ్వాలి..

మా భూమిని ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ల నిర్మాణం కోసం స్వాధీనం చేసుకుంది. మేం కోర్టును ఆశ్రయించాం. భూమి కోల్పోయిన దళితులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అందించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మాకు ఇళ్లను కేటాయించాలి.

– కొట్టె శివ, న్యూశాయంపేట

ఆరేళ్లుగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం పేదల నిరీక్షణ

8.12 ఎకరాలు.. 19 బ్లాకులు..

608 ఇళ్లు

అర్హులకు అందేనా?

ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు

పట్టించుకోని అధికారులు

1/3

2/3

3/3

Advertisement
 
Advertisement