హక్కులు, బాధ్యతలు తెలిసి ఉండాలి
● కన్జూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్‌కుమార్
నెక్కొండ: వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలు తెలిసిఉంటేనే ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ జరుగుతున్న మోసాలను గుర్తించవచ్చని కన్జూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర్గుపల్లి శ్రవణ్‌కుమార్‌శాసీ్త్ర అన్నారు. స్థానిక హైస్కూల్‌లో సోమవారం జాతీయ వినియోగదారుల వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు తమకు చట్ట ప్రకారం సంక్రమించిన హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో హెచ్‌ఎం శ్రీదేవి, గైడ్ టీచర్ వినయ్‌కుమార్, సీఆర్‌పీలు శ్రీనివాస్, చారి, సుమలత, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి
● వీసీలో రాష్ట్ర ఎన్నికల అధికారి
సుదర్శన్‌రెడ్డి
న్యూశాయంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను జనవరి 13వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబితా మ్యాపింగ్ సమర్థవంతంగా చేపట్టాలని, ఓటరు జాబితాలో ఉన్న డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను గుర్తించి సరిచేయాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అశోక్‌కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి హర్షిత, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ
అవార్డుకు ఎంపిక
కాళోజీ సెంటర్: అంతర్జాతీయ అవార్డుకు ప్రముఖ జ్యోతిష్య పండితుడు, వాస్తు విద్వాంసులు డాక్టర్ చేవూరి రమేశ్‌కుమార్ ఎంపికయ్యారు. హనుమకొండ పరిమళకాలనీకి చెందిన రమేశ్ 26 సంవత్సరాలుగా జ్యోతిష్య పండితుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు ఆయన సేవలను గుర్తించిన గ్లోబల్, ఈగల్ యూనివర్సిటీ యునిఎర్త్ హ్యుమానిటీ పీస్ ఫౌండేషన్ (యూఎస్‌ఏ) సంయుక్తంగా యూనివర్సల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 27న మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో జరగనున్న సదస్సులో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు కేతన్, భూపేశ్, గైడ్ రమణారావుతో పాటు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆయన తెలిపారు.
దివ్యాంగులకు కృత్రిమ
అవయవాల పంపిణీ శిబిరం
కాళోజీ సెంటర్: దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరాన్ని ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్‌బాబు, అడిషనల్ సీఈఓ రాజేంద్రకుమార్‌లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగవాన్ మహవీర్ ట్రస్ట్ సౌజన్యంతో కొత్తవాడలోని పద్మశాలీ వెల్ఫేర్ ట్రస్టు ప్రాంగణంలో ఉచిత శిబిరం జరుగుతుందన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా నాణ్యమైన కృత్రిమ కాళ్లు అమర్చనున్నారన్నారు. ఆసక్తి గలవారు 9490133650, 9885981959, 9949446802, 7095915728 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
నేడు జాబ్ మేళా
కాళోజీ సెంటర్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు నేడు (మంగళవారం) ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావచ్చని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని, ఎంపికై న వారు ఉమ్మడి వరంగల్ జిల్లా, హైదరాబాద్‌లలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
హక్కులు, బాధ్యతలు తెలిసి ఉండాలి


