ఽకొత్తకోట రూరల్/మదనాపురం: జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో మార్కెట్‌కు ధాన్యం భారీగా చేరుతోంది. ఇదే అదునుగా భావించిన దళారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో రైతుల పొలాల వద్దకే వెళ్లి పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం తాలు, తేమ, కంకి నల్లి, కాటుక రోగం తెగుళ్లు వంటి కారణాలు చూపుతూ ధరలను తగ్గిసున్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.
సన్నరకమే అధికంగా..
ప్రభుత్వం ఏడురకాల సన్నాలను సాగు చేయాలని సూచించిన నేపథ్యంలో రైతులు ఆయా రకాలనే అధికంగా సాగు చేశారు. జిల్లాలో ఎక్కువగా జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్, బీపీటీ రకాలు సాగు చేశారు. కొన్ని గ్రామాల్లో రైసుమిల్లర్లతో ఒప్పందం చేసుకున్న రైతులు 1010 దొడ్డురకం సాగు చేశారు. పొలం వద్ద కోసిన వెంటనే రైస్‌మిల్లుకు తరలిస్తే దొడ్డురకం క్వింటా రూ.2,200 చెల్లించారు. సన్నరకం పచ్చి వరి క్వింటా రూ.3,600 కొనుగోలు చేసి ఇప్పుడు రూ.2,800కే కొంటామంటూ దళారులు గ్రామాల్లో తిరుగుతున్నారు. వారం రోజుల్లోనే సన్నరకం క్వింటాకు రూ.800, దొడ్డు రకం ధాన్యానికి రూ.400 తగ్గించడానికి కారణం దళారులు సిండికేట్‌గా మారడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ధరలు బాగా వస్తున్నాయని సంబరపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో సన్నరకాలకు బోనస్‌తో కలిపి సుమారు రూ.3 వేల వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నందున కొనుగోలు కేంద్రాలకే తమ ధాన్యం తరలించేందుకు ఆరబెట్టుకుంటున్నారు.
‘ ఆరుగాలం కష్టపడి వరి పండించిన రైతులు ధరలు పడిపోవడంతో విలవిలలాడుతున్నారు. కోతల ప్రారంభంలో ఎక్కువ ధర ఆశజూపిన వ్యాపారులు.. ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో ధాన్యం చేతికి రాగానే అకస్మాత్తుగా ధరలో తీవ్ర కోత విధించారు. మొన్నటి వరకు సన్న ధాన్యానికి అధిక ధరలు చెల్లించేందుకు పోటీపడిన వ్యాపారులు ప్రస్తుతం ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే క్వింటా ఏకంగా సుమారు రూ.800 పడిపోవడంతో తీవ్ర వేదనకు గురవుతున్నారు.’
కొనుగోలు కేంద్రాలు తెరవాలి..
వారం కిందటి వరకు సన్నరకం వరికి మంచి ధర పలికింది. ప్రస్తుతం వ్యాపారులంతా ఒకే విధంగా ధరలు తగ్గిస్తున్నారు. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని వి క్రయించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, పాలకులు స్పందించి కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదు. – అబ్దుల్లా, రైతు, అమడబాకుల
తక్కువ ధరకు అడుతున్నారు..
కోతల ప్రారంభంలో వరి ధాన్యానికి మంచి ధర చెల్లించిన దళారులు ఇప్పుడు తక్కువ ధరకు అడుతున్నారు. మూడెకరాల్లో సన్నరకం సాగు చేశా. ఆశించిన ధర వస్తుందని అరబెట్టినా ఫలితం లేదు. క్వింటా రూ.2,500 మాత్రమే చెల్లిస్తామని.. దానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. క్వింటా రూ.3 వేల పైబడి ధర ఇస్తేనే బయట మార్కెట్లో అమ్ముతా. మొన్నటి దాకా ఉరుకులు, పరుగుల మీద ధాన్యం కొంటామని వచ్చిన వారు ఇప్పుడు కానరావడం లేదు. – మండ్ల శాంతమూర్తి,
అజ్జకొల్లు (మదనాపురం)
పాలకులు, అధికారుల నిర్లక్ష్యమే
అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కావడం లేదు. కోతలు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడం బాధాకరం. దళారులు మొదట్లో కాకుల్లా కల్లాల దగ్గరకు వచ్చి పచ్చి ధాన్యం సైతం అధిక రేట్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అందరు సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వ్యాపారులను రానివ్వడం లేదు. ఇక్కడ ఉన్న వ్యాపారులంతా ఒక్కటై రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. అధికారులు త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– పి.రాంచంద్రారెడ్డి, రైతు, కొత్తకోట
కొనుగోలు కేంద్రాల ప్రారంభమెప్పుడో.. ?
నవంబర్ 1న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ నేటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. తుఫాను ప్రభావం, వాతావరణ మార్పులతో అకాల వర్షాలు కురుస్తాయనే భయంతో రైతులు దళారును ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు రైతులకు మాయమాటలు చెప్పి కొర్రీలు పెడుతూ తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు ప్రత్యేక చొరవ చూపి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభిస్తే దళారుల నుంచి రైతులకు విముక్తి లభించి లాభపడుతారని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో తగ్గిన వరి ధాన్యం ధరలు
నాణ్యతగా లేవంటూ సాకులు
ఊపందుకున్న పంట కోతలు
ఆందోళన చెందుతున్న రైతులు


