పొదుపు.. ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

పొదుపు.. ప్రోత్సాహం

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

నర్వ: మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించేందుకు ప్రభుత్వం మరిన్ని స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు సుమారు ఏడాదిన్నరగా సంఘాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మహిళలు పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొంది చిరు వ్యాపారాలు, స్వయం ఉపాధి పనులు చేపడుతూ లబ్ధి పొందుతున్నారు. మిగిలిన అర్హులైన మహిళలను గుర్తించి వీరికి అవగాహన కల్పించి రుణాలు అందించాలనే లక్ష్యంతో కొత్త సంఘాల ఏర్పాటుకు అంకురార్పణ చేసింది.

ఇవీ మార్గదర్శకాలు..

కొన్నిరోజులుగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) సంస్థల అధికారులు కొత్త మహిళా సంఘాల ఏర్పాటుకు అర్హులైన వారిని గుర్తించే పనులో నిమగ్నమయ్యారు. నిరు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 18 ఏళ్ల నుంచి 58 ఏళ్లలోపు మహిళలు సంఘాల్లో చేరే అవకాశం కల్పించారు. గతంలోని ఓటరు జాబితా ఆధారంగా మహిళలను గుర్తించి కొత్త సంఘాల్లో చేరే విధంగా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నారు. సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో గ్రూపులో 10 సభ్యులు తప్పనిసరిగా ఉండాలన్నదే నిబంధన. 18 ఏళ్లు నిండిన మహిళందరూ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండాలనే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఐకేపీ అధికారులు క్షేత్రస్థాయిలో మహిళలను గుర్తించి సంఘాలు ఏర్పాటు చేశారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించి పొదుపు ప్రారంభించారు. అయితే వీరిని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు (రివాల్వింగ్‌ఫండ్‌) అందించనుంది. ఈ మేరకు కొత్త సంఘాల వివరాలు పంపాలని సెర్ప్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇది పూర్తయితే నెలఖరులోగా ఆయా సంఘాల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,076 గ్రామైఖ్య సంఘాలు, 50,637 పొదుపు సంఘాలు ఉన్నాయి. సుమారు ఏడాదిన్నరగా ఏపీఎం, సీసీలు, వీఓఏలు ఇప్పటి వరకు 3,420 కొత్త సంఘాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 947.. అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 499 సంఘాలున్నాయి. ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున రూ.5.13 కోట్లను ప్రభుత్వం ప్రత్యేక నిధిని ప్రోత్సాహకంగా జమ చేయనుంది. ఇందుకుగాను ఆయా సంఘాల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వివరాల సేకరణ పూర్తయితే నేరుగా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.

జిల్లా సంఘాల రివాల్వింగ్‌ ఫండ్‌

సంఖ్య (రూ.లలో..)

జోగుళాంబ గద్వాల 947 1,42,05,000

మహబూబ్‌నగర్‌ 734 1,10,10,000

నాగర్‌కర్నూల్‌ 671 100,65,000

వనపర్తి 569 85,35,000

నారాయణపేట 499 74,85,000

వివరాలు సేకరిస్తున్నాం..

కొత్తగా ఏర్పాటైన స్వయం సహాయక సంఘాల వివరాలు సేకరిస్తున్నాం. సంఘాల ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంఘాల వివరాలన్నీ సేకరించి పంపిస్తాం. వివరాల క్రోడీకరణ అనంతరం ప్రభుత్వం నుంచి నేరుగా సంఘాల బ్యాంకు ఖాతాలో రివాల్వింగ్‌ ఫండ్‌ జమయ్యే అవకాశం ఉంది.

– గోవిందు, డీపీఎం, నారాయణపేట

నిబంధనలు ఇవి..

18 ఏళ్లు నిండి వివాహాం అయిన వారు మాత్రమే అర్హులు.

ప్రభుత్వ ఉద్యోగులు,

ఉద్యోగుల భార్యలకు అవకాశం లేదు.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకే

ప్రథమ ప్రాధాన్యం.

ఉమ్మడి జిల్లాలో 3,420 కొత్త సంఘాల ఏర్పాటు

మహిళల ఆర్థిక సంఘటితమే లక్ష్యంగా ముందుకు..

ఒక్కో సంఘానికి రూ.15 వేల రివాల్వింగ్‌ ఫండ్‌

వివరాల సేకరణలో అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement