పాత టీడీఆర్‌ల ఆన్‌లైన్..
సంబంధిత పత్రాలు
సమర్పిస్తేనే..
రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారికి ‘టీడీఆర్’
● ఆన్‌లైన్‌లో మొదలైన ప్రక్రియ
● నెల కిందట స్థానిక పురపాలికలో ఏర్పాటైన వైనం
● ఆఫ్‌లైన్ టీడీఆర్‌కు సైతం ఆన్‌లైన్ అవకాశం
టీడీఆర్ అవకాశాన్ని రహదారి విస్తరణ బాధితులు సద్వినియోగం చేసుకోవాలి. దీంతో అభివృద్ధి హక్కులు దక్కడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించబడుతుంది. స్థానిక మున్సిపాలిటీలో టీడీఆర్ బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు అభివృద్ధిలో భాగంగా టీడీఆర్ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– నిరంజన్, పుర కమిషనర్, వనపర్తి
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణతో ఖాళీ స్థలాలు, భవనాలు కోల్పోయే వారికి పరిహారం అందించే దిశగా ప్రభుత్వం టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్థానిక పురపాలికకు నెల కిందట టీడీఆర్ బ్యాంకు మంజూరైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆన్‌లైన్‌లో కొనసాగిస్తున్నారు. దీంతో రహదారుల విస్తరణలో నష్టపోయే ఆస్తుల యజమానులకు నిబంధనల ప్రకారం అభివృద్ధి హక్కుల రూపంలో పరిహారం పొందే అవకాశం కలగనుంది.
నష్టానికి అనుగుణంగా..
రహదారి విస్తరణలో ప్రైవేట్ స్థలాలు, భవనాలు, ఇతర ఆస్తుల్లో కొంతభాగం ప్రభుత్వ అవసరాలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు బాధితులకు టీడీఆర్ రూపంలో పరిహారం కల్పిస్తారు. నష్టపోయిన భూ విస్తీర్ణం, ఆస్తుల వివరాలు, ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని హక్కును నిర్ణయిస్తారు. దీనిద్వారా బాధితులు తమకు లభించిన అభివృద్ధి హక్కులను ఇతర ప్రాంతాల్లో అదనపు నిర్మాణ విస్తీర్ణం పొందేందుకు వినియోగించుకోవచ్చు. లేదంటే ఇతరులకు బదిలీ చేయడం, విక్రయించుకోవడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే వెసులుబాటు ఉంటుంది. తద్వారా రహదారుల విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి కొంతమేర నష్టపరిహారం అందినట్లవుతుంది.
గత ప్రభుత్వ హయాంలో రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేసిన టీడీఆర్‌లను కూడా ప్రస్తుతం ఆన్‌న్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 30 టీడీఆర్‌లను ఆన్‌లైన్ చేసినట్లు సమాచారం. దీంతో గతంలో టీడీఆర్ పొందిన ఆస్తుల యజమానులకు కూడా డిజిటల్ విధానంలో గుర్తింపు లభించనుంది. భవిష్యత్‌లో వాటి వివరాలను పరిశీలించడం, బదిలీ ప్రక్రియ చేపట్టడం మరింత సులభతరం కానుంది.
జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారు సంబంధిత పత్రాలతో పుర కార్యాలయంలో సంప్రదించవచ్చు. అధికారులు ఆస్తుల వివరాలు, నష్టపోయిన విస్తీర్ణాన్ని పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీడీఆర్ మంజూరుచేసే ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు రహదారుల విస్తరణకు భూములు, భవనాలు ఇచ్చే విషయంలో పరిహారంపై ఆందోళన చెందే ఆస్తుల యజమానులకు ఈ విధానం కొంత ఊరటనివ్వనుంది. పట్టణ అభివృద్ధికి రహదారుల విస్తరణ ఎంతో అవసరం. అదే సమయంలో ఆస్తు లు కోల్పోయే వారికి న్యాయమైన ప్రయోజనం కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో వనపర్తి పురపాలికలో టీడీఆర్ బ్యాంకు అందుబాటులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విధానం సమర్థంగా అమలైతే పట్టణంలో భవిష్యత్ రహదారుల విస్తరణ పనులకు మార్గం సుగమం కావడంతో పాటు బాధిత ఆస్తుల య జమానులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.


