ఆక్రమణల తొలగింపు సమయంలో కొందరు వ్యాపారులు పుర అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరి నిర్మాణాలు 10 నుంచి 20 అడుగుల వరకు ఆక్రమణలో ఉన్నప్పటికీ వాటిని తొలగించకుండా తమ దుకాణాల వద్దకే యంత్రాలు తీసుకురావడమేమిటని కమిషనర్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనల ప్రకారమే ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ బాధితులకు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ వివాదం ముదురుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ యంత్రాల సాయంతో డ్రైనేజీ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు, సెట్‌బ్యాక్ లేని నిర్మాణాల తొలగింపును కొనసాగించారు.


