ఆత్మకూర్: ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మించుకొనే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. గురువారం మండలంలోని ఆరేపల్లిలో ఆయన పర్యటించి ఉపాధిహామీ పథకంలో నిర్మిస్తున్న ఇంకుడుగుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని, నీటిని వృథా చేయకుండా, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బోరుబావులను లీజుకు తీసుకోవాలని, పశువులకు నీరు అందేవిధంగా చూడాలని, రాబోయే రోజుల్లో అప్రమత్తంగా ఉండేలా గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి ఎల్‌నినో గురించి అవగాహన కల్పించారు. ఆయన వెంట డీఆర్డీఓ ఉమాదేవి, ఎంపీడీఓ శ్రీరాంరెడ్డి, సర్పంచ్ రామచంద్రయ్య, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దతండా(ఆర్)లో పర్యటన..
వనపర్తి రూరల్: మండలంలోని పెద్దతండా(ఆర్)లో గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పర్యటించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని గ్రామంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల గురించి సర్పంచ్ దానమ్మతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వీబీజీ రాంజీ పథకంలో చేపడుతున్న పనులను సద్వినియోగం చేసుకోవాలని, వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా నీటికుంటలు నిర్మించుకొనేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి నాగమణి, జీపీఓ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.


