ఖిల్లాఘనపురం: త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ముందుచూపుగా గ్రామాల్లోని ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని ఓ కళ్యాణ వేదికలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు, హరీశ్‌రావు పర్యటన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు ఎన్నికల ఇన్‌చార్జ్ ఇంతియాజ్ ఇసాక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి బీఆర్‌ఎస్ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వరద నీరు సకాలంలో సద్వినియోగం చేసుకోకపోవడంతో నేడు అన్నదాతలు పంటలు ఎండి అల్లాడుతున్నారని, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు నవంబర్ 2న మాజీ మంత్రి హరీశ్‌రావు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యేలా చూడాలన్నారు. 100 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, నాయకులు బాలీశ్వర్‌రెడ్డి, మన్యంగౌడ్, పీన్యానాయక్, సర్పంచులు వట్టెం నాగయ్య, మాన్యానాయక్, రామకృష్ణ, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.


