బియ్యం ధరలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

బియ్యం ధరలకు రెక్కలు

Oct 1 2026 1:05 AM | Updated on Oct 1 2026 1:05 AM

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి.. కారణాలు అనేకం..

ప్రజలపై రూ.లక్షల్లో భారం..

నాగర్‌కర్నూల్‌: సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పది నెలల్లో క్వింటాకు రూ. 2వేల వరకు అధికం కాగా.. రెండు నెలల్లో మాత్రం రూ.1200 పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు విస్తీర్ణం తక్కువగా ఉందని.. ఆశించినంత దిగుబడి రాకపోవచ్చనని వ్యాపారులు అంచనా వేసి ధరలు పెంచేశారు. ఇటీవల కొన్ని రైస్‌మిల్లులు మూతపడటాన్ని కూడా వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బియ్యం కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలతో సొమ్ము చేసుకుంటున్నారనే మిమర్శలు ఉన్నాయి. బియ్యం ధరల పెరుగుదలతో ఉమ్మడి జిల్లాలోనే రోజు రూ.15 లక్షల వరకు ప్రజలపై అదనపు భారం పడుతోంది. రేషన్‌ లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుండటం కొంత ఉపశమనం కలిగిస్తుండగా.. ఇతర వర్గాలపై బియ్యం ధరల ప్రభావం బాగానే ఉంది. వానాకాలం వరికోతలు ప్రారంభమైతే కొంత మేర ధరలు తగ్గే అవకాశం ఉంది.

తెలంగాణలో పండే సన్నబియ్యం (ఆర్‌ఎన్‌ఆర్‌) రకానికి మంచి డిమాండ్‌ ఉంది. ప్రధానంగా పాలమూరులో ఆర్‌ఎన్‌ఆర్‌ సాగుకు మంచి పేరుంది. ఇక్కడ పండే పంట ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి ఇక్కడి నుంచి ఎక్కువగా ఈ రకం బియ్యాన్ని వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. దీంతో ఇక్కడ సన్నబియ్యానికి డిమాండ్‌ ఏర్పడి, రేట్లు పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌, మిర్యాలగూడ ప్రాంత వ్యాపారుల ఆజమాయిషీలోనే బియ్యం రేట్ల నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.

వానాకాలంలో వరిసాగు చాలా తక్కువగా ఉంది. ఉన్న పంటకు సైతం కరెంటు కోతలు, నీటి సమస్యలతో ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో వరిసాగు కాల్వలకు నీరు రావడంతో 4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అయితే వర్షాభావం, కేఎల్‌ఐ కాల్వలకు నీటి విడుదలలో అంతరాయం, కరెంటు కోతలతో పంట దిగుబడి తగ్గే పరిస్థితి ఏర్పడింది. దీంతో బియ్యం కొరత ఉంటుందనే అంచనాతో వ్యాపారులు ధరలు పెంచారు.

● ప్రభుత్వం రేషన్‌ దుకాణాలు, వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలకు సన్నబియ్యం సరఫరా చేస్తోంది. సన్న వడ్లను సీఎంఆర్‌ కోసం మిల్లర్లు కొనుగోలు చేయడంతో మార్కెట్‌లో నిల్వలు తగ్గాయి. ఫలితంగా కొరత పెరిగి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

పది నెలల్లో పెరుగుదల ఇలా..

పది నెలలుగా సన్నబియ్యం ధరలను పరిశీలిస్తే, ప్రజల గుండె గుభేలుమంటోంది. గతేడాది నవంబర్‌లో కింటా బియ్యం ధర రూ. 4,400 ఉండగా.. ప్రస్తుతం రూ. 6,400 నుంచి రూ. 6,600 వరకు విక్రయిస్తున్నారు. అయితే మార్చి నుంచి ధరల పెరుగుదల ప్రారంభమైంది. ఫిబ్రవరి వరకు రూ. 4,600 ఉండగా.. ఏప్రిల్‌లో ఏకంగా క్వింటాకు రూ. 300 పెరిగి, రూ. 4,900కి విక్రయించారు. మే నుంచి జూలై వరకు రూ.200 పెరుగుకుంటూ వచ్చింది. జూలైలో రూ. 5,500 ఉండగా.. ఆగస్టులో చివరి వారంలో రూ. 6,300కు చేరింది. సెప్టెంబర్‌లో రూ. 6,600 ధర పలుకుతోంది. ఈ రేట్లు కేవలం హోల్‌సెల్‌ వ్యాపారులకు మాత్రమే. వారికి హమాలీ, రవాణా ఖర్చుతో క్వింటాకు మరో రూ. 200 వరకు పెరుగుతుంది. ఈ లెక్కన ప్రజలకు రూ. 6,800 నుంచి రూ.7వేల వరకు బియ్యం విక్రయిస్తున్నారు.

10 నెలల్లోనే క్వింటాకు రూ.2వేల దాక పెంపు

గతేడాది ఇదే నెలలో రూ 4,500 ధర.. ప్రస్తుతం రూ.6,600కు విక్రయం

ఉమ్మడి జిల్లా ప్రజలపై రోజు రూ.15లక్షల వరకు భారం

ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు విస్తీర్ణం తగ్గడమే కారణం

ఉమ్మడి జిల్లాలో రోజుకు 1,400–1,600 క్వింటాళ్ల బియ్యం విక్రయమవుతోంది. క్వింటాకు రూ.1,000 పెరిగితే రోజుకు సుమారు రూ.15 లక్షల అదనపు భారం ప్రజలపై పడుతోంది. బియ్యం ధరల పెరుగుదల ప్రభావంతో హోటళ్లలోనూ ధరలు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement