చెరువుల్లోకి చేపపిల్లలు | - | Sakshi
Sakshi News home page

చెరువుల్లోకి చేపపిల్లలు

Oct 1 2026 1:05 AM | Updated on Oct 1 2026 1:05 AM

జిల్లాలో ప్రారంభమైన మత్స్యబీజం పంపిణీ పెద్ద చెరువులను గుర్తించాలి.. పంపిణీకి అంతా సిద్ధం..

జిల్లాలో ప్రారంభమైన మత్స్యబీజం పంపిణీ

● మొత్తం 965 చెరువులు..

నీటితో నిండినవి 456

● 148 మత్స్య పారిశ్రామిక

సంఘాలు

● గుర్తించిన చెరువులు,

జలాశయాలకు ప్రాధాన్యం

●

ప్రభుత్వం జిల్లాలోని పెద్ద చెరువులను గుర్తించి వాటిలో గతం కంటే అధికంగా చేప పిల్లలను వదలాలి. మత్స్యకార్మికుల జనాభాను దృష్టిలో ఉంచుకొని మేలు రకం చేప పిల్లలను అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చేప పిల్లలను వదలడం ఆలస్యమైంది. త్వరగా వదలాలి.

– జీఎస్‌ గోపి, మత్స్యకార్మిక సంఘం నాయకుడు, అమరచింత

ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల వారీగా గుర్తించిన చెరువుల్లో చేప పిల్లలను ఉచితంగా అందించేందుకు అన్ని సిద్ధం చేశాం. జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్‌ సహకారంతో 15 మండలాల్లోని ప్రతి చెరువు, కుంటలో వీటిని వదిలేందుకు కార్యాచరణ రూపొందించాం. ఈసారి మేలురకం చేప పిల్లలను అందించాలని సంబంధిత గుత్తేదారులను ఆదేశించాం. – లక్ష్మప్ప, ఏడీ, జిల్లా మత్స్యశాఖ

అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అదేరోజు జిల్లాకేంద్రంలోని నల్లచెరువులో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి 1.36 లక్షల చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విడతల వారీగా జిల్లాలో గుర్తించిన జలాశయాలు, చెరువులు, కుంటల్లో 2.36 కోట్ల చేప పిల్లలను ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పంపిణీకి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందిస్తే వాటిని గ్రామాల్లోని చెరువుల్లో వదిలి అవి పెరిగాక విక్రయించి లబ్ధి పొందాలనే ఆలోచనతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. కొన్నేళ్లుగా ముదిరాజ్‌ కులస్తులకు అందిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకార్మిక కుటుంబాలు రోజువారి జీవనభృతిని సంపాదించుకునేందుకు వీలు కలిగింది.

జిల్లాలో ఇలా..

జిల్లాలోని 255 గ్రామాల్లో 965 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటితోపాటు రామన్‌పాడు, జూరాల జలాశయంతో పాటు రంగసముద్రం, శంకర సముద్రం వంటి పెద్ద చెరువుల్లో చేప పిల్లలను వదలుతున్నారు. ఇందుకుగాను ఆయా మండలాల్లో మత్స్యకార్మికులు అధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి మత్స్యశాఖ అధికారులు, మత్స్య సహకార సంఘాలు, సొసైటీలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 148 సంఘాలుండగా.. 13,613 మంది మత్స్యకారులు సభ్యులుగా కొనసాగుతున్నారు. గతేడాది 2.24 కోట్ల చేప పిల్లలను వదిలిన అధికారులు ఈసారి 2.36 కోట్లు వదలనున్నారు. వీటిలో 35 ఎంఎం నుంచి 40 ఎంఎం రకం 122.884 లక్షలు, 80 ఎంఎం నుంచి 100 ఎంఎం 107.5875 లక్షల చేప పిల్లలు కొనుగోలు చేశారు.

ఎల్‌నినోతో ఆలస్యం..

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం ఆశించిన మేర వర్షాలు కురవక గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 965 చెరువులు, నీటికుంటలు ఉండగా.. చేపలు పెంచడానికి వీలుగా నీటితో నిండిని చెరువులు 456 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈసారి ప్రభుత్వం ఆలస్యంగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడానికి వర్షాలు కురవకపోవడం కూడా ప్రధాన కారణమని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికై నా చెరువులు, కుంటల్లో ఏ మేర చేప పిల్లలు వదులుతున్నారనే విషయాలను సొసైటీలకు అందించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement