‘జపామేడ్‌’ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘జపామేడ్‌’ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Oct 1 2026 1:05 AM | Updated on Oct 1 2026 1:05 AM

వనపర్తి: నైపుణ్యాలు కలిగిన జపామేడ్‌ (నవజాత శిశువు, తల్లి సంరక్షకురాలు)లకు నగరాల్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో జపామేడ్‌ కోర్స్‌పై మహిళల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఒక మహిళకి బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 40 రోజుల కాలాన్ని జపా కాలంగా పిలుస్తారన్నారు. ఈ సమయంలో తల్లి, శిశువుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని, వారి సంరక్షణ చూసుకునే కేర్‌ టేకర్లను జపామేడ్‌లు అంటారని తెలిపారు. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తల్లి, శిశు సంరక్షణ కోసం అనుభవం కలిగిన కేర్‌టేకర్ల సేవలకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. ప్రస్తుత కాలంలో అనేక పనులను ఏఐ, రోబోల ద్వారా నిర్వహిస్తున్నప్పటికీ తల్లి, శిశువుల సంరక్షణ వంటి సేవలను ఏ టెక్నాలజీ రీప్లేస్‌ చేయడం సాధ్యం కాదని, అందువల్ల ఈ రంగానికి ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుందని చెప్పారు. జిల్లాకేంద్రంలో ఆర్‌సేటీ ఆధ్వర్యంలో ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. 20 రోజుల పాటు నిర్వహించే శిక్షణలో అభ్యర్థులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. ఈ వృత్తిలో రాణించాలంటే సేవాభావం, ఆసక్తి, ఓర్పుతో పాటు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం నగరాల్లో పలు సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం ద్వారా చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రామమహేశ్వర్‌రెడ్డి, ఎల్‌డీఎం శివకుమార్‌, ఆర్‌సేటీ డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌, ఏపీఎం సరోజ, నర్సింగ్‌ కళాశాల ఫ్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు.

భూ రీ–సర్వేలో భాగస్వాములు కావాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ–సర్వే కార్యక్రమంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని రీ–సర్వే ప్రక్రియ, లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల భాగస్వామ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు వేతనాలు చెల్లిస్తామని చెప్పలేదని, రీ–సర్వే పనులకు ఎకరాకు రూ.60 చొప్పున పారితోషికం చెల్లిస్తుందని తెలిపారు. కష్టపడి నైపుణ్యంతో పనిచేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని.. ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రీసర్వే కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు దోహదపడుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, సర్వేశాఖ ఏడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement