అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిగాకపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నిల్వనీరు వృథాగా పారుతోంది. ప్రభుత్వం మూడేళ్ల కిందట షట్టర్ల మరమ్మతుకు రూ.20 లక్షలు మంజూరు చేసింది. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న సమయంలో కాల్వ ప్రధాన హెడ్ రెగ్యులేటరీ వద్ద షట్టర్లకు నీటి సరఫరా నిలిపివేసేందుకు రింగ్‌బండ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతిసారి రింగ్‌బండ్ ఏర్పాటు చేయడం.. వచ్చిన వరద ప్రవాహంతో మొర్రం కొట్టుకుపోవడంతో మరమ్మతు పూర్తి కావడం లేదు. ప్రస్తుత సమయంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయక చేతులెత్తేస్తున్న అధికారులు.. సమాంతర కాల్వ నుంచి రోజు 60 నుంచి 100 క్యూసెక్కుల నీరు లీకేజీ రూపంలో వృథాగా పారుతున్నా అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిచేసి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


