క్రేన్
సాయంతో గణనాథుడి నిమజ్జనం
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలో ఐదురోజుల పాటు పూజలందుకున్న గణనాథులు శనివారం రాత్రి నిమజ్జనానికి తరలారు. శుక్రవారం నిమజ్జనం చేయకూడదనే సెంటిమెంట్‌తో నిర్వాహకులు శనివారం నిమజ్జనం నిర్వహించారు. భిన్న ఆకృతుల్లో దర్శనమిచ్చిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో డప్పులు, సన్నాయి వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో తీసుకెళ్లారు. శోభాయాత్రలో యువత నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. వివిధ కాలనీలు, ప్రధాన రహదారులపై కొలువుదీరిన సుమారు 40 విగ్రహాలను హైదరాబాద్ రోడ్‌లోని నల్లచెరువుకు తరలించారు. జిల్లాకేంద్రంలోని 22వ వార్డు గణేష్‌నగర్ వినాయకుడిని ఎద్దుల బండిపై నిమజ్జనానికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. నల్లచెరువు వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మట్టి విగ్రహాలు, పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి నల్లచెరువులో వేర్వేరు ప్రాంతాలను ఏర్పాటుచేసి ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.


