వనపర్తి: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – 2026లో భాగంగా 88,727 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 61,116 మందికి అందజేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అనామలీస్, అన్‌మ్యాపింగ్ జాబితాలో నోటీసులు ఇవ్వాల్సిన అంశంపై సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. నోటీసులు అందుకున్న ఓటర్లతో విచారణ చేసి సమర్పించిన డాక్యుమెంట్లను బీఎల్వోలతో అప్‌లోడ్ చేసిన అనంతరం డాటా ఎంట్రీ చేయించే ప్రక్రియ సైతం వేగవంతం చేసేలా ప్రణాళికతో అధికారులను సమాయత్తం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,757 మంది ఓటర్లు సమర్పించిన డాక్యుమెంట్లపై విచారణ పూర్తి చేశామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విచారణ చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


