వంట గ్యాస్‌ తంటాలు! | - | Sakshi
Sakshi News home page

వంట గ్యాస్‌ తంటాలు!

Sep 6 2026 12:43 AM | Updated on Sep 6 2026 12:43 AM

నిబంధనలు మార్చాలి..

మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండటంతో సిలిండర్‌ త్వరగా అయిపోతుంది. 21 రోజు ల వరకు కొత్త సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు వంట చేయడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, ఆయిల్‌ కంపెనీలు ఈ నిబంధనపై పునరాలోచించి అవసరమైన వారికి ముందుగానే సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాలి.

– ఇందిర, గృహిణి, కొత్తకోట

పాత పద్ధతిలోనే ఇవ్వాలి..

గ్రామాల్లో 45 రోజుల తర్వాతే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పండుగలు, శుభకార్యాల సమయంలో గ్యాస్‌ వినియోగం పెరిగి త్వరగా అయిపోతోంది. గడువు పూర్తయ్యే వరకు సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం లేకపోవడంతో కట్టెల పొయ్యి వినియోగించాల్సి వస్తోంది. ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించి పాత పద్ధతిలో నే సిలిండర్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాలి. – సురేంద్రాచారి, అమడబాకుల

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..

జిల్లాలో గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విధానం స్థానికంగా రూపొందించిన నిబంధన కాదు. చమురు సంస్థలు (ఓఎంసీలు) అమలు చేస్తున్న విధానాలకు అనుగుణంగానే గ్యాస్‌ పంపిణీ జరుగుతోంది. గ్యాస్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కొత్త గ్యాస్‌ కనెక్షన్లు, రీఫిల్‌ బుకింగ్‌లు, సరఫరా సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆదేశాలు ఎలా వస్తే అలా నడుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు,

జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

కొత్తకోట రూరల్‌: జిల్లాలో కొత్త గ్యాస్‌ కనెక్షన్ల మంజూరు నిలిచిపోవడంతో దరఖాస్తులుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది మార్చి నుంచి గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతో ఇప్పటి వరకు గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారు, కొత్తగా పెళ్లయిన జంటలు, వేరు కాపురాలు పెట్టినవారు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ వినియోగం పెరగడంతో కొత్త కనెక్షన్ల అవసరం అంతకంతకూ పెరుగుతోంది. కొత్త కనెక్షన్లు పునః ప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించకపోవడంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది.

అనధికారిక నిషేధమా..?

ఇటీవల అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయిల్‌ యుద్ధంతో హర్మూజ్‌ జలసంధి మూతబడి గ్యాస్‌ దిగుమతికి ఆటంకం కలగడంతో దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. గ్యాస్‌ సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్న పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఇంధన దిగుమతి సరిగా లేకపోవడంతో కొత్త గ్యాస్‌ కనెక్షన్ల మంజూరును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తే సంక్షోభం మరింత పెరుగుతోందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గ్యాస్‌ ఏజెన్సీలు వెబ్‌సైట్లలో కొత్త కనెక్షన్ల దరఖాస్తు ఆప్షన్‌ను మూసివేసినట్లు డీలర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సిలిండర్‌ ఉన్న వారు ఇతర మార్గాల ద్వారా గ్యాస్‌ వినియోగించుకుంటున్న వారంతా కొత్త కనెక్షన్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం చల్లారినా దాని ప్రభావం వీడటం లేదు. మార్చిలో వంట గ్యాస్‌ కొరత ఏర్పడగా.. అప్పటికి నుంచి ఏజెన్సీల పరిధిలో కొత్త కనెక్షన్లు, రెండో సిలిండర్‌ మంజూరు నిలిచిపోయింది. మరోవైపు గ్యాస్‌ బుకింగ్‌కు 45 రోజుల నిబంధన విధించడంతో రెండో సిలిండర్‌ లేని గ్రామీణ ప్రాంత వినియోగదారులు కట్టెల పొయ్యిని వినియోగించాల్సిన పరిస్థితి తలెత్తింది.

జిల్లాలో నిలిచిన కొత్త కనెక్షన్ల మంజూరు

పేరుకుపోతున్న దరఖాస్తులు

వినియోగదారులకు తప్పని తిప్పలు

సరఫరాలో ఇబ్బందులే కారణమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement