నాటి రాజసం వచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

నాటి రాజసం వచ్చేనా?

Sep 4 2026 12:42 AM | Updated on Sep 4 2026 12:42 AM

శత్రు దుర్భేద్యంగా.. ఉమ్మడి జిల్లాకే గర్వకారణం పర్యాటకంగా గుర్తించాలి

18వ శతాబ్దంలో శత్రుదుర్భేద్యంగా చంద్రగఢ్‌కోటను నిర్మించిన చంద్రగిరి మహారాజు

త్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు కోటను దుర్భేద్యంగా కట్టారు. అంతెత్తు ప్రహరీని దాటుకుని శత్రు మూకలు లోపలికి వచ్చే అవకాశం లేదు. కోట ప్రధాన ద్వారం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇరువైపులా అరుగులు, ఎత్తయిన తలుపులు, కోటపై భాగంలో ఫిరంగుల అరలు.. గత ఘన వైభవాన్ని చాటుతాయి. కోటపై భాగంలో కాపలా ఉండే సై నికులు శత్రుదేశాల రాజులు ఎవరైనా దండెత్తడానికి వస్తే వారిని సుమారు పది కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టి ఫిరంగులతో దాడి చేయడానికి వీలుగా కోట గోడ భాగంలో భారీ రంధ్రాలు ఏర్పాటు చేశారు. వీటి నుంచి శత్రువుల కదలికలను గుర్తించి ఎదుర్కొనే అవకాశం ఉంది.

చంద్రగఢ్‌ కోటను పర్యాటక శాఖ గుర్తించి ఆధునీకరిస్తే ఉమ్మడి జిల్లాకే ఇది గర్వ కారణంగా మారుతుంది. పక్కనే ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న సందర్శకులు, పర్యాటకులు ప్రాజెక్టుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగఢ్‌ కోటను సందర్శించేందుకు వస్తున్నారు. కానీ వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

– నాగేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌, చంద్రగఢ్‌

అమరచింత మండలంలో అతి ప్రాచీనమైన చంద్రగఢ్‌ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసేలా మంత్రి వాకిటి శ్రీహరి చొరవ చూపాలి. పర్యాటకంగా గుర్తిస్తే ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరికే అవకాశం ఉంది.

– వెంకటేష్‌ అమరచింత

అమరచింత: నాడు ఉమ్మడి జిల్లాలోని అన్ని సంస్థానాధీశుల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఆర్థికంగా, రాజసంగా వెలుగొందిన కోట నేడు పాలకుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా, శిథిలావస్థకు గోడలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అత్యంత పురాతన కట్టడాల్లో ఒకటైన చంద్రగఢ్‌ కోట అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. ఈ కోటను 18వ శతాబ్దంలో నాటి చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు శత్రుదుర్భేద్యంగా నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. అలాంటి వారసత్వ సంపదను కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన ప్రభుత్వాలు కోట పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి సైతం కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అడుగులు పడకపోవడంపై స్థానికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇలాగే కొన్నాళ్లు గడిస్తే చంద్రగఢ్‌ కోట చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితులు దాపరిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శిథిలమవుతున్న కోట గోడలు..

సరైన నిర్వహణ లేక చంద్రగఢ్‌ కోట లోపల గల రాతి గోడలు ఒకొక్కటిగా శిథిలమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ కోటను సందర్శించి వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని, పర్యాటకంగా గుర్తింపు తీసుకొస్తామని ప్రకటించారు. అప్పట్లో కేవలం కోటపైకి వెళ్లడానికి వీలుగా సీసీ రహదారిని నిర్మించి వదిలేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కోటను పట్టించుకోనే వారే కరువయ్యారు.

జిల్లా మంత్రులు దయచూపేనా?

ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు చంద్రగఢ్‌ కోటను పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి కోటను సందర్శించిన ఆయన రూ.20 లక్షలు సీసీ రహదారి కోసం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా.. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడంతో సీసీ రహదారికి నోచుకోలేదు. ఇప్పటికై నా జిల్లా మంత్రులు చొరవ చూపి చంద్రగఢ్‌కు పర్యాటక శోభ తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చుట్టూ ఆహ్లాదకరమే..

18వ శతాబ్దంలో మరాఠి రాజుల కాలంలో బాజీరావు పీష్వా ఆత్మకూర్‌ శంస్థానానికి సంబంధించిన పన్నులు వసూలు చేయడానికి చంద్రసేనుడిని నియమించగా.. ఆయన ధర్మాపురంలో గ్రామానికి ఉత్తర దిశగా చుట్టూ పచ్చని పొలాలు, ఆహ్లాదకరంగా ఉండేలా ఎత్తైన కొండపై కోటను నిర్మించాడు. నాటి నుంచి ఇక్కడి నుంచే చంద్రసేనుడు వివిధ శంస్థానధీశుల నుంచి పన్నులు వసూలు చేస్తూ మరాఠాకు పంపుతుండేవారు. చంద్రసేనుడు నిర్మించిన కోట కావడంతో కాలక్రమంలో దీన్ని చంద్రగఢ్‌ కోటగా నామకరణం చేశారు. కోట మధ్యలో రామలింగేశ్వర ఆలయంతో పాటు రాతిపొరల మధ్య తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఎనిమిది కొలనుల్లో ఏడాది పొడవునా నీరు ఉండడం మరో విశేషం. సాక్షాత్తు పరమశివుడు కొలువైన గుట్ట కావడంతోనే గంగమ్మ తల్లి ఇక్కడ కొలువైందని భక్తులు విశ్వసిస్తారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జాతరతో పాటు నిత్యపూజలు నిర్వహిస్తూ వచ్చారు.

సుదూర ప్రాంతాల నుంచి

సందర్శనకు వస్తున్న పర్యాటకులు

వసతులు లేక ఇబ్బందులు

మంత్రుల హామీతోనైనా ముందడుగు పడుతుందని స్థానికుల ఆశ

పన్నుల వసూళ్లతో నాడు కళకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement