వనపర్తి: మహిళలు పారిశ్రామిక రంగంలో ఎదిగేందుకు ’వీ హబ్’ ‘ర్యాంప్–ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం’ చక్కటి అవకాశమని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలోని వీ–హబ్ సౌజన్యంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అందిస్తున్న శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ సహకారం, ఇతర ప్రోత్సాహకాలను మహిళలు వినియోగించుకొని తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్ అవకాశాలను సృష్టించుకోవాలన్నారు. కార్యక్రమంలో వీ హబ్ సీనియర్ డైరెక్టర్ జాహీద్ అక్తర్ షేక్, డైరెక్టర్ ఊహ, డీఆర్‌డీఓ రామమహేశ్వర్, ఆర్‌సెటీ డైరెక్టర్ అనిల్, అడిషనల్ డీఆర్‌డీఓ తదితరులు పాల్గొన్నారు.
కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించాలి
గోపాల్‌పేట: వీబీజీరాంజీ పథకంలో భాగంగా కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించాలని, నీటి వనరుల అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంతో పాటు మున్ననూరులో పర్యటించి ఫార్మ్‌ఫాండ్ పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఇప్పటివరకు చేపట్టిన పనులు, పురోగతి, కూలీల హాజరు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో మంజూరైన వీబీజీ రాంజీ పనులకు త్వరితరగతిన గ్రౌండింగ్ పూర్తి చేసి, లేబర్ మొబిలైజేషన్‌ను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా పనులను చేపట్టడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎంపీడీఓ అయేషాఅంజుం, ఏపీఓ నరేందర్, వీబీజీ రాంజీ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


