వనపర్తి: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అన్‌మ్యాప్డ్, అనామలీస్ ఓటర్ల నోటీసుల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) టి.వినోద్‌కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా అన్‌మ్యాప్డ్ (నో మ్యాపింగ్), అనామలీస్ (వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు) కేటగిరీల వారికి జారీ చేసిన నోటీసుల పరిష్కారం, తదుపరి చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం సూచించిన విధంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు అర్హతను నిర్ధారించే అవసరమైన పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ఎన్నికల సంఘం పేర్కొన్న 11 రకాల పత్రాల కేటగిరీలలో సంబంధిత పత్రాలను నిర్దేశించిన తేదీలలో ఓటర్లు సమర్పించవచ్చన్నారు. 18 ఏళ్లు పూర్తైన వారు సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి
కొత్తకోట: చదువే మానవ అభ్యున్నతికి మూలమని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీపీ మండల్ లైబ్రరీ, స్టడీ హాల్‌ను బుధవారం అదనపు కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అదేవిధంగా స్వశక్తితో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన సుతారి విజయ్‌కుమార్, ముంత శివశంకర్ యాదవ్, గౌనికాడి రాములుయాదవ్, సత్తి సుధాకర్, మహారాజ్‌లను రెవెన్యూ అదనపు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సైదయ్య, మదనాపురం మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, వార్డు కౌన్సిలర్ బోయేజ్, శ్రీనివాస్, పెంటన్న యాదవ్, సుభాష్, కృష్ణారెడ్డి, హోటల్ కురుమూర్తి, భాస్కర్, వెంకటేష్, నాగరాజు, మాజీ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


