అమలయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

అమలయ్యేనా?

Sep 1 2026 12:43 AM | Updated on Sep 1 2026 12:43 AM

పక్కాగా అమలుకు చర్యలు.. అనుభవాత్మక విద్యే లక్ష్యం..

జిల్లాలో విస్మరించిన అధికారులు, నిర్వాహకులు

పర్యవేక్షణే కీలకమే..

అమలుకు నోచుకోని వైనం..

విద్యార్థులపై పుస్తకాల బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు నో బ్యాగ్‌ డే నిర్వహించాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. పాఠశాలల్లో కచ్చితంగా అమలు చేయాలి. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులు పాఠశాలలను పర్యవేక్షించి అమలు తీరును పరిశీలిస్తారు.

– యాదయ్య, ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాధికారి

నో బ్యాగ్‌ డే అంటే పుస్తక జ్ఞానానికి బదులుగా అనుభవాత్మక అభ్యసనానికి ప్రాధాన్యం ఇచ్చే రోజని అర్థం. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను నిజ జీవితానికి అనుసంధానం చేయడంతో విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు సమస్య పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత, సంభాషణా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులపై పుస్తకాల బ్యాగుల బరువును తగ్గించడం ఒక కోణం కాగా.. విద్యను తరగతి గది గోడలకే పరిమితం చేయకుండా జీవితానికి అనుసంధానం చేయడమే నో బ్యాగ్‌ డే అసలు లక్ష్యం. ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విద్యార్థులను వివిధ కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తే ఆచరణాత్మక విద్యకు ఇది మంచి వేధికగా మారుతుంది. అయితే లక్ష్యాలు, మార్గదర్శకాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా విద్యాశాఖ పర్యవేక్షణ, పాఠశాలల చొరవ, ఉపాధ్యాయుల భాగస్వామ్యం తప్పనిసరి.

వనపర్తి టౌన్‌: విద్యార్థులకు పుస్తకాల బ్యాగుల భారాన్ని తగ్గించడంతో పాటు వారిలో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రతి నెల మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ను అన్ని పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉంది. ఆ రోజున విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండా పాఠశాలకు హాజరై తరగతి గదికి పరిమితం కాని విధంగా వివిధ ఆచరణాత్మక, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు చూడాల్సి ఉంది. సాధారణ రోజుల్లో పుస్తకాలు, రాత పుస్తకాల ఆధారంగా జరిగే బోధనకు భిన్నంగా ఆ రోజు విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేలా పాఠశాలలు ప్రణాళిక రూపొందించాలి. చిత్రలేఖనం, కథలు చెప్పడం, క్విజ్‌, సైన్స్‌ ప్రయోగాలు, పాత్రధారణ, నాటికలు, బాలసభలు, సృజనాత్మక రచనలు, స్థానిక వృత్తులు–కళలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి కుటుంబం, పరిసరాలు, గ్రామం, పట్టణం, వివిధ వృత్తులపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి. ఉన్నత తరగతుల విద్యార్థులకు పోస్టాఫీసు, బ్యాంకు, మార్కెట్‌, రేషన్‌ దుకాణం, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, వృత్తి నిపుణుల వద్దకు తీసుకెళ్లి ఆయా రంగాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందించాలి. మాదిరి అసెంబ్లీ, మాదిరి ఎన్నికలు, ఆర్థిక నిర్వహణ, కుటుంబ బడ్జెట్‌, సామాజిక అంశాలపై చర్చలు వంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సామాజిక బాధ్యతను పెంచే అవకాశం ఉంటుంది. కానీ జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలుకు నోచుకోవడం లేదు.

● నో బ్యాగ్‌ డేలో విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ప్రతిభావంతులైన విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడిన వారు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా చూడాలి. క్షేత్ర పర్యటనలు నిర్వహించే సందర్భంలో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. కార్యక్రమం పూర్తయిన అనంతరం విద్యార్థులు ఏం నేర్చుకున్నారు.. ఏ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారనే అంశాలను కూడా పరిశీలిస్తే కార్యక్రమానికి మరింత ప్రయోజనం చేకూరుతుంది.

నో బ్యాగ్‌ డే అమలులో పాఠశాలల పర్యవేక్షణ కూడా కీలకమే. విద్యాశాఖ అధికారులు, మండలస్థాయి అధికారులు, ప్రధానోపాధ్యాయులు కార్యక్రమం సక్రమంగా కొనసాగుతుందా లేదా అన్నది పరిశీలించాలి. పాఠశాలలకు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడంతో పాటు ప్రతి నెల మూడో శనివారం నిర్వహించిన కార్యక్రమాల వివరాలను నమోదు చేసుకునే విధానం ఉంటే అమలు తీరును అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఆదేశాలు జారీ చేయడం కాకుండా క్షేత్రస్థాయిలో అవి అమలవుతున్నాయా లేదా అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ అవసరం.

విద్యార్థులకు దొరకని ఆటవిడుపు

కాగితాలకే పరిమితమైన వైనం

ఈ ఏడాదైనా ప్రాధాన్యత లభించేనా..?

పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా.. ఈ కార్యక్రమం అమలుకు నోచుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర అధికారుల ఆదేశాలు నీరుగారుతున్నాయి. ఇప్పటికీ జిల్లాలో 10 పాఠశాలలకు మించి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించకపోవడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 165 ప్రైవేట్‌ పాఠశాలల్లో 36,144 మంది, 498 ప్రభుత్వ పాఠశాలల్లో 33,057 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా 69,201 మంది విద్యార్థులు నో బ్యాగ్‌ డేకు దూరంగానే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement