జల చౌర్యం ప్రభుత్వానికి పట్టదా.. : మాజీ మంత్రి | - | Sakshi
Sakshi News home page

జల చౌర్యం ప్రభుత్వానికి పట్టదా.. : మాజీ మంత్రి

Sep 1 2026 12:43 AM | Updated on Sep 1 2026 12:43 AM

వనపర్తి: యథేచ్ఛగా నికర జలాల చౌర్యానికి పాల్పడుతున్న ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో తెలంగాణ సర్కారు విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక బీఆర్‌ఎస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్నిరోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని గ్రావిటీ పద్ధతిన బాహాటంగా తరలించుకుపోతున్నా.. కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేయాలన్న సోయి లేకపోవడం శోచనీయమన్నారు. కృష్ణానదిలో తెలంగాణకు దక్కాల్సిన నీటివాటాకు గండికొట్టి నికర జలాలను దోచుకుంటే.. నిమ్మకుండటం ఏపీ సర్కారుకు తాపేదారుగా రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్నట్లేనని తెలిపారు. 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం చేయకపోవడానికి కొందరు అక్కసుతో కోర్టులో కేసులు వేయడమే ప్రధాన కారణమన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో పంపింగ్‌ స్టేషన్లు, రిజర్వాయర్లు, టన్నెళ్ల నిర్మాణంలో కీలక పనులు పూర్తి చేశామని చెప్పారు. 2023 నాటికే దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో ఆశించిన పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం చేస్తే తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఏపీ వినియోగించుకునేందుకు అవకాశాలిచ్చినట్లేనన్నారు. జూరాలకు వరద వచ్చిన సమయంలో కూడా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ పనులను పూర్తి చేయడంలోనూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఏపీ ప్రభుత్వం వెలుగొండలో 19 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు పూర్తి చేయగలిగినప్పుడు.. తెలంగాణలో ప్రాజెక్టుల పనులను ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్యనూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అవగాహన లేకుండా, నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని.. రాజకీయంగా గట్టి సమాధానం ఇస్తామన్నారు. 14 ఏళ్ల పాటు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడామని, పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ నీటి హక్కుల కోసం అవసరమైతే మరోసారి గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement