పాన్‌గల్: మండలంలోని దావాజిపల్లి, నిజామాబాద్‌లో ఒక్కో డెంగీ కేసు నమోదైనట్లు పీహెచ్‌సీ వైద్యురాలు డా. మైథిలీ సోమవారం తెలిపారు. ఆయా గ్రామాల్లో బాధితుల ఇళ్ల పరిసరాల్లోని వారి నుంచి వైద్యసిబ్బంది రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సోమవారం దావాజిపల్లిలో ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేసి రక్త నమూనాలను సేకరించి అవసరం ఉన్న వారికి మందులు పంపిణీ చేశామన్నారు. గ్రామంలో పర్యటించి పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వైద్యసిబ్బంది రాంచందర్, కమల, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పోలీసు సేవలు మరింత చేరువ : ఎస్పీ
వనపర్తి: ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడమే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఆమె హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు చేయకుండా నేరుగా పోలీసులను సంప్రదించి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజల సమస్యలు, వినతులను నేరుగా స్వీకరించి పరిష్కారం చూపేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు.
22(ఏ) భూములను గుర్తించాలి
వనపర్తి: జిల్లాలో 22(ఏ) కింద నమోదైన మొత్తం భూమి ఎంత ఉందో సర్వేనంబర్ల వారీగా గుర్తించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరెట్‌లోని తన చాంబర్‌లో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 22ఏ కింద 2025, డిసెంబర్ కంటే ము ందు నమోదైన భూమి ఎంత? తదుపరి ఇప్ప టి వరకు భూ భారతి ద్వారా సరిచేయగా మిగిలిన భూమి ఎంత ఉందో సర్వేనంబర్ వారీగా వివరాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో డి– సెక్షన్ సూపరింటెండెంట్ సునీత పాల్గొన్నారు.


