వీపనగండ్ల: ప్రజల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని.. నిర్లక్ష్యం సరికాదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండలంలో నెలకొన్న సమస్యలపై ఉన్నతస్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూ సర్వే కోసం దరఖాస్తు చేసినా.. పట్టించుకోని మండల సర్వేయర్ శివపై తక్షణ చర్యలు తీసుకొని ఇంక్రిమెంట్ నిలిపివేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌ను ఆదేశించారు. కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పించుకోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని.. వాట్సప్‌లో ఫిర్యాదు చేసినా సత్వరమే పరిష్కరించాలని కోరారు. మండల కేంద్రంతో పాటు కల్వరాల, గోపల్‌దిన్నెలో నెలకొన్న భూ సమస్యలతో పాటు భీమా కాల్వకు తక్షణ మరమ్మతు చేపట్టి ఆయకట్టుకు సాగునీరు అందేలా చూడాలన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు అధికారులు చొరవ చూపి ప్రైవేట్ సంస్థల ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు. ఓటు హక్కు కోల్పోతే సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతారని.. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేవిధంగా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య, స్థానిక సర్పంచ్ మీసాల పార్వతమ్మ, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


