అమరచింత: ఓటరు జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనన్న గుబులు నో మ్యాచింగ్ నోటీసులు అందుకున్న వారిలో నెలకొంది. అప్పట్లోనే బీఎల్వోలు ఏది అడిగినా ఇచ్చామని.. మళ్లీ ఎందుకు నోటీసులు ఇస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. 2002 ఓటరు జాబితాలోని పేర్లకు.. ఇప్పటి ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లలో స్వల్ప మార్పులున్న వారు జిల్లావ్యాప్తంగా 88 వేల మందికిపైగా ఉండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు ఓటర్లకు బీఎల్వోలు నో మ్యాపింగ్ నోటీసులు అందించడం, అక్కడే సరైన ఆధారాలు అందిస్తే వెంటనే ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయడం వంటి పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. వారం రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమం ద్వారా పలువురు నోటీసులు అందుకున్న ఓటర్లు పూర్తి సమాచారంతో మరోమారు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకునేందుకు బీఎల్వోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో తహసీల్దార్ల సమక్షంలో నోటీసులు అందిస్తుండగా.. మరికొన్ని మండలాల్లో ఎంపీడీఓల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మండలాల్లో రోజుకో గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడే సాయంత్రం వరకు ఉండి ఆధారాల పత్రాలతో వచ్చి వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికై నా కొత్తగా వచ్చే ఓటరు జాబితాలో తమ పేర్లు ఉండాయో లేదోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చిన్న చిన్న పొరపాట్లే..
నోటీసులు అందుకున్న వారిలో అత్యధికంగా చిన్న చిన్న పొరపాట్లే ఉన్నాయని అధికారులు తెలిపారు. తండ్రి, తల్లి, ఇంటి పేరు, కాలనీల పేరు ఇలా చిన్న చిన్న తప్పులే అధికంగా ఉండటంతో వాటికి సంబంధించి రుజువుతో కూడిన పత్రాలతో గ్రామపంచాయతీలకు వెళ్తున్నారు.
అందజేయాల్సిన పత్రాలివే..
పదోతరగతి మెమో, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్, కుల ధ్రువీకరణ పత్రం, 2002 ఓటరు జాబితాలో పేరుకు సంబంధించిన జిరాక్స్, పట్టాదారు పాసు పుస్తకం, డ్రైవింగ్ లైసెన్స్.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పెద్ద నాగమ్మ పోతుల, అమరచింత మండలంలోని నాగల్ కడ్మూర్ స్వగ్రామం. అయితే ఓటరు జాబితాలో పెద్దనాగమ్మ పోతుల అని ఉండగా ఆధార్‌కార్డులో మాత్రం పోతుల పెద్ద నాగమ్మ అని ఉంది. దీంతో నో మ్యాపింగ్ కింద సరైన ఆధారాలు సమర్పించాలని నోటీసు అందించారు. దీంతో ఆమె అయోమయానికి గురై ఆధార్ కార్డును తీసుకొని బీఎల్వోకు ఇచ్చింది. తన పేరు ఓటరు జాబితాలో ఉంటుందా.. లేదా అని అధికారులను ప్రశ్నిస్తుంది.
జిల్లాలో 88 వేల మందికిపైగా నో మ్యాపింగ్ నోటీసులు
తండ్రి, భర్త, ఇంటి పేర్లే ప్రధాన సమస్య
సరైన ఆధారాలతో మళ్లీ ఆన్‌లైన్ చేయాలని సూచన
ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లున్నా.. తప్పని తిప్పలు
వలస వెళ్లిన వారి కష్టాలు..
నో మ్యాపింగ్ జాబితాలో పేర్లున్న ఓటర్లలో చాలామంది బతుకుదెరువు కోసం ఇతర పట్టణాలకు వలస వెళ్లడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామాల్లో నో మ్యాపింగ్ నోటీసులు అందించడానికి సదరు కుటుంబ సభ్యులు లేకపోవడంతో వారి బంధువులకు సమాచారమిచ్చి అందజేస్తున్నారు. వలసవెళ్లిన వారు తమ ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ ప్రతులను తమ బంధువులకు పంపించి అధికారులు అందిస్తున్న పరిస్థితులు దాపురించాయి. మరికొన్ని గ్రామాల్లో ఇదే సమస్య తీవ్రంగా ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


